Twitter: ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే.. ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ

  • కంపెనీ సామర్థ్యాన్ని పెంచడమే తాను చేసిన తప్పన్న డోర్సే
  • ట్విట్టర్ ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉంటారన్న సహ వ్యవస్థాపకుడు
  • ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నాక ఉద్యోగాల్లో కోతలు
Jack Dorsey apologises to Twitter employees for mass layoffs

ట్విట్టర్‌లో ఉద్యోగాల కోతపై ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్పందించారు. సంస్థలోని ఉద్యోగులను 50 శాతానికి తగ్గించాలన్న సంస్థ ప్రస్తుత యజమాని ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని తప్పుబట్టిన డోర్సే.. ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ తెలిపారు. ట్విట్టర్‌లో ప్రస్తుత ఉద్యోగులు, గతంలో పనిచేసిన వారు మానసికంగా దృఢంగా ఉంటారని, కఠిన పరిస్థితుల్లోనూ ఓ కొత్త మార్గాన్ని అన్వేషిస్తారని అన్నారు. చాలామందికి తనపై కోపం ఉంటుందన్న సంగతి తనకు తెలుసని, వారి ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. అతి తక్కువ సమయంలోనే కంపెనీ సామర్థ్యాన్ని పెంచానని, అదే తాను చేసిన తప్పు అని, అందుకు క్షమించాలని డోర్సే ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్న తర్వాత సంస్థలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకుంటూనే పలు విభాగాల హెడ్‌లను తొలగించారు. అలాగే, ట్విట్టర్‌లో ఉద్యోగుల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. కాగా, డోర్సే మే నెలలోనే ట్విట్టర్ బోర్డు నుంచి తప్పుకున్నారు. డోర్సే 2006లో మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్‌ను స్థాపించారు. 2015లో ట్విట్టర్‌కు సీఈవోగా నియమితులయ్యారు. గతేడాది నవంబరులో సీఈవో పదవికి రాజీనామా చేసిన ఆయన, ఈ ఏడాది మేలో డైరెక్టర్ బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు.

More Telugu News