సూర్యుడి కంటే పది రెట్లు పెద్దదైన కృష్ణబిలం గుర్తింపు
- భూమికి అత్యంత సమీపంలో కొత్త బ్లాక్ హోల్
- హవాయిలోని జెమినీ టెలిస్కోప్ ద్వారా గుర్తింపు
- శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న కృష్ణబిలం
ఇంతక్రితం కనుగొన్న కృష్ణబిలం కంటే ఇది భూమికి మూడు రెట్లు చేరువలో ఉంది. ఇది నక్షత్ర ద్రవ్యరాశి విభాగానికి చెందినదని భావిస్తున్న పరిశోధకులు, అసాధారణ అంతరిక్ష భాగాల పరిణామక్రమం గుట్టు విప్పేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.
శాస్త్రవేత్తల్లో మరింత ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏమిటంటే... పాలపుంతలో నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాన్ని స్పష్టంగా గుర్తించడం ఇదే ప్రథమం. నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చితే 5 నుంచి 100 రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇలాంటివి ఒక్క పాలపుంతలోనే 100 మిలియన్ల వరకు ఉంటాయట.
ఈ వివరాలు రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ నెలవారీ ప్రచురణల్లో చోటుచేసుకున్నాయి. ఈ కృష్ణబిలంతో పాటు ఉన్న మరో నక్షత్రాన్ని కూడా పరిశోధకులు హవాయిలో ఉన్న జెమినీ నార్త్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు.