MS Dhoni: ఐపీఎస్ అధికారిపై కోర్టు ధిక్కారం పిటిషన్ వేసిన ఎంఎస్ ధోనీ

Dhoni moves criminal contempt plea in Madras HC against IPS officer G Sampath kumar
  • మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు పట్ల ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు
  • తన పిటిషన్ లో కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ధోనీ
  • చర్యలు తీసుకోవాలని వినతి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎస్ అధికారి జి. సంపత్ కుమార్ కు వ్యతిరేకంగా నేరపూరిత కోర్టు ధిక్కరణ అభియోగాల కింద మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం కోరుతూ సంపత్ కుమార్, జీ మీడియా కార్పొరేషన్ పై ధోనీ లోగడ సివిల్ వ్యాజ్యం దాఖలు చేశారు. 

తదనంతరం మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు తోపాటు తనపై సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ధోనీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేరపూరిత కోర్టు ధిక్కరణ కింద అతడ్ని శిక్షించాలని కోరారు. ‘‘సుప్రీంకోర్టు న్యాయ పాలన నుంచి తన దృష్టిని మరల్చింది. జస్టిస్ ముద్గల్ కమిటీ (2013 నాటి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన) సిఫారసులను పక్కన పెట్టేసింది. సీబీఐ అధికారి వివేక్ ప్రియదర్శినికి విచారణ నిమిత్తం సీల్డ్ కవర్ లో దీన్ని అందించకపోవడం వెనుక కోర్టుకు ఉద్దేశ్యాలున్నాయి’’ అని సంపత్ కుమార్ చేసిన ఆరోపణలను ధోనీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

మద్రాస్ హైకోర్టు పట్ల అగౌరవంగా, అపకీర్తి కలిగించే విధంగా వ్యవహరించినట్టు ధోనీ తెలిపారు. అలాగే, మద్రాస్ హైకోర్టు, న్యాయవాదులు, తమిళనాడు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కు వ్యతిరేకంగా ఆరోపణలు చేసినట్టు పేర్కొన్నారు.

MS Dhoni
criminal contempt plea
Madras high court
IPS officer
G Sampath kumar

More Telugu News