Imran Khan: కాల్పుల ఘటనను ఖండించిన ఇమ్రాన్ మాజీ భార్యలు

Imran Khan ex wives reacts to firing incident
  • వజీరాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు
  • త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్న ఇమ్రాన్
  • ఇమ్రాన్ కాలి గాయానికి బుల్లెట్ గాయం
  • స్పందించిన మాజీ భార్యలు జెమీమా, రెహామ్
లాంగ్ మార్చ్ ర్యాలీ సందర్భంగా వజీరాబాద్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరగడం పాకిస్థాన్ లో సంచలనం సృష్టించింది. అయితే ఇమ్రాన్ కు ప్రాణహాని తప్పడంతో ఆయన పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ ఊపిరి పీల్చుకుంది. ఈ కాల్పుల ఘటనపై ఇమ్రాన్ మాజీ భార్యలు స్పందించారు. మొదటి భార్య జెమీమా గోల్డ్ స్మిత్, రెండో భార్య రెహామ్ ఖాన్ ఈ కాల్పుల ఘటనను ఖండించారు. 

ఈ కాల్పుల ఘటనలో ఇమ్రాన్ స్వల్పగాయాలతో తప్పించుకోవడం పట్ల జెమీమా గోల్డ్ స్మిత్ సంతోషం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ పై కాల్పులు జరిగాయని తెలియగానే భయపడ్డామని తెలిపారు. ఇమ్రాన్ పై మరిన్ని రౌండ్లు కాల్పులు జరగకుండా దుండగుడ్ని అడ్డుకున్న ఇబ్తెసామ్ అనే వ్యక్తిని ఆమె హీరోగా అభివర్ణించారు. అంతేకాదు, తన కుమారులకు తండ్రిని మిగిల్చిన ఆ వ్యక్తికి రుణపడి ఉంటామని తెలిపారు. 

బ్రిటన్ లో సంపన్న కుటుంబానికి చెందిన జెమీమా గోల్డ్ స్మిత్ ను ఇమ్రాన్ ఖాన్ 1995లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. 9 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బ్రిటన్ కే చెందిన టీవీ యాంకర్ రెహామ్ ఖాన్ ను ఇమ్రాన్ వివాహం చేసుకున్నారు. 2015లో ఈ వివాహం జరగ్గా, 10 నెలలకే ఆ బంధం ముగిసింది. 

తాజాగా తన మాజీ భర్తపై కాల్పులు జరిగాయని తెలియగానే రెహామ్ ఖాన్ ట్విట్టర్ లో స్పందించారు. పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్, ఇతర నేతలపై కాల్పులు జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని రెహామ్ ఖాన్ పేర్కొన్నారు. రాజకీయ నేతల భద్రతను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
Imran Khan
Jemima Goldsmith
Reham Khan
Firing
Pakistan

More Telugu News