Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయి: నాదెండ్ల మనోహర్

  • ఇటీవల విశాఖలో ఘటన
  • అప్పటి నుంచి పవన్ ను అనుసరిస్తున్నారన్న నాదెండ్ల
  • పవన్ ఇంటి వద్ద గొడవ చేశారని వివరణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడి
Nadendla Manohar revealed some suspicious vehicles follows Pawan Kalyan vehicle

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఇటీవల అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కల్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద కొత్త వ్యక్తులు తిరుగాడుతున్నారని తెలిపారు. 

పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయని నాదెండ్ల వివరించారు. ఆ వాహనాల్లోని వ్యక్తులు పవన్ కల్యాణ్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారని, వారు అభిమానులు కారని పవన్ కల్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా చెబుతున్నారని నాదెండ్ల వెల్లడించారు. 

నిన్న కారులోనూ, ఇవాళ బైకులపైనా పవన్ వాహనాన్ని అనుసరించారని వివరించారు. అంతకుముందు, సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి పవన్ నివాసం వద్ద గొడవ చేశారని నాదెండ్ల  తెలిపారు. పవన్ ఇంటి ఎదురుగా వారు కారు నిలపగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోబోయారని, దాంతో వారు బూతులు తిట్టడం మొదలుపెట్టారని, పవన్ కల్యాణ్ ను దూషించారని నాదెండ్ల పేర్కొన్నారు.

సిబ్బందిని వారు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, కానీ సిబ్బంది సంయమనం పాటించి ఆ ఘటనను వీడియో తీశారని వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన తెలంగాణ ఇన్చార్జి శంకర్ గౌడ్ కు అందించగా, ఆయన జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారని నాదెండ్ల వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News