Space: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

  • భూమికి, శుక్రుడికి మధ్య ప్లానెట్ కిల్లర్ గుర్తించామన్న అంతరిక్ష పరిశోధకులు
  • 2014 తర్వాత ఇంత భారీ గ్రహశకలం కనిపించలేదని వ్యాఖ్య
  • భూమికి అతి సమీపంలో నుంచే దూసుకెళుతుందని వెల్లడి
  • దీనికి ఎంతకాలం పడుతుందనేది చెప్పలేమన్న సైంటిస్టులు
Space Scientists Spot Planet Killer Asteroid That May Threaten Earth

అంతరిక్షంలో భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలాలు మూడింటిని గుర్తించినట్లు పరిశోధకులు తాజాగా వెల్లడించారు. భూమి, శుక్రుడి కక్ష్య మధ్యలో తిరుగుతున్న ఈ గ్రహశకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయని వివరించారు. ఈ మూడింటిలో ఒకదాని వ్యాసం 1.1 కిలోమీటర్ల నుంచి 2.3 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. దీనిని 2022 ఏపీ7 అని వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. 

2014 తర్వాత ఇంత పెద్ద గ్రహశకలాన్ని గుర్తించలేదన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన భారీ గ్రహశకలాల్లో టాప్ 5% లో ఇది కూడా ఉంటుందని వివరించారు. ఇంత భారీగా ఉండే గ్రహశకలాలను ‘ప్లానెట్ కిల్లర్’ అంటారని కార్నెగీ ఇనిస్టిట్యూషన్ ఫర్ సైన్స్ పరిశోధకుడు స్కాట్ షెపర్డ్ వెల్లడించారు. ఇంతటి భారీ గ్రహశకలాలు తిరుగుతున్నా ఇప్పటి వరకు గుర్తించకపోవడానికి కారణం సూర్యుడి కాంతి అని తెలిపారు. ప్రకాశవంతమైన కాంతి వల్ల ఈ గ్రహశకలాన్ని టెలిస్కోప్ లలో గుర్తించలేకపోయామని వివరించారు. ఈ పరిశోధన వివరాలతో ‘ది ఆస్ట్రోనామికల్ జర్నల్’ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఎలా గుర్తించారంటే..
భూకక్ష్యలోనే తిరుగుతున్నప్పటికీ సూర్యుడి కాంతి కప్పేయడం వల్ల ఈ భారీ గ్రహశకలాలను ఇప్పటి వరకూ గుర్తించలేదని పరిశోధకులు చెప్పారు. అయితే, డార్క్ ఎనర్జీ కెమెరా సాయంతో సూర్యుడి కాంతి ప్రభావం తక్కువగా ఉన్న సమయంలో వీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు. విండో ఆఫ్ ట్విలైట్ గా వ్యవహరించే ఈ సమయం రోజు మొత్తమ్మీద కేవలం పదినిమిషాలు మాత్రమే ఉంటుందని పరిశోధకులు చెప్పారు. ఆ సమయంలో డార్క్ ఎనర్జీ కెమెరాను ఉపయోగించి ఈ గ్రహశకలాలను గుర్తించామని తెలిపారు.

అత్యంత సమీపంలోనుంచి దూసుకెళుతుంది..
2022ఏపీ 7 గ్రహశకలం భూమిని ఢీ కొట్టే ముప్పు ప్రస్తుతానికైతే లేదని షెపర్డ్ వివరించారు. ఈ గ్రహశకలం భూమికి సమీపంలో నుంచి భూకక్ష్య ను దాటుకుంటూ పోతుందని తెలిపారు. భూమికి దగ్గరగా రావడానికి చాలా సంవత్సరాలు పడుతుందని, అప్పటికి ఈ గ్రహశకలంతో ముప్పు ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.

More Telugu News