Dy Superintindent: ఖైదీల భార్యలపై కన్నేసిన చర్లపల్లి జైలు ఉన్నతాధికారి... వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేసిన జైళ్లశాఖ!

  • చర్లపల్లి జైలులో కీచక అధికారి!
  • డిప్యూటీ సూపరింటిండెంట్ పై తీవ్ర ఆరోపణలు
  • జైళ్ల శాఖకు ఫిర్యాదు చేసిన ఖైదీల భార్యలు
  • తీవ్రంగా పరిగణించిన జైళ్ల శాఖ డీజీ
  • చింతల దశరథంపై చర్యలకు ఆదేశాలు
Jail Dept transfers an official after harassment allegations

నేరాలకు పాల్పడి జైలు పాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్దేశిత సమయం పాటు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. 

అయితే, చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ములాఖత్ కు వచ్చే ఖైదీల భార్యలపై కన్నేసి, వారిపై వేధింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందాయి. దశరథం తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. 

ఈ వ్యవహారం జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ జితేందర్ వద్దకు చేరగా, ఆయన దశరథం తీరుపై తీవ్రంగా స్పందించారు. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న చింతల దశరథంను జైలు అధీనంలోని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. 

గతంలో జైల్లోని మహిళా సిబ్బందిపైనా దశరథం లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.

More Telugu News