Guntur District: ఒకే పార్టీలో ఉంటూ తగవు పడి.. వేర్వేరు పార్టీల్లో ఉంటూ ఒక్కటైన రాయపాటి, కన్నా

rayapati sambasiva rao and kanna lakshminarayana attends guntur court
  • 2010లో రాయపాటిపై పరువు నష్టం దావా వేసిన కన్నా లక్ష్మీనారాయణ
  • ఈ కేసు విచారణ కోసమే గుంటూరు కోర్టుకు వచ్చిన నేతలు
  • కన్నాపై వ్యాఖ్యలను కోర్టులోనే వెనక్కు తీసుకున్న రాయపాటి
  • పరువు నష్టం దావాను ఉపసంహరించుకున్న కన్నా
  • కేసు విచారణను పూర్తి అయినట్టు ప్రకటించిన కోర్టు

కోస్తాంధ్రకు చెందిన ఇద్దరు రాజకీయ ఉద్ధండులు మంగళవారం ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు... బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలు మంగళవారం గుంటూరులోని స్థానిక కోర్టుకు హాజరయ్యారు. 2010లో దాఖలైన ఓ పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం వీరిద్దరూ ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. 


2010లో రాయపాటిపై కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆ సమయంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం గమనార్హం. నాడు రాయపాటి గుంటూరు లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతుండగా... కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి ఏపీ మంత్రిగా కొనసాగుతున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అదికారంలోకి రాగా... వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కన్నా మంత్రిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాల్లో కన్నా మంత్రిగా కొనసాగారు. ఈ క్రమంలోనే స్థానిక రాజకీయాల నేపథ్యంలోనే ఆయన రాయపాటిపై పరువు నష్టం దావా వేశారు.

ప్రస్తుతం రాయపాటి టీడీపీలో కొనసాగుతుండగా...కన్నా బీజేపీలో కొనసాగుతున్నారు. 12 ఏళ్ల క్రితం కన్నాపై రాయపాటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు నొచ్చుకున్న కన్నా.. రాయపాటిపై పరువు నష్టం దావా వేయడం జరిగిపోయాయి. ఈ కేసు 12 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదరడం, కన్నాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునేందుకు రాయపాటి సంసిద్ధత వ్యక్తం చేయడం... తాను దాఖలు చేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకునేందుకు కన్నా కూడా సిద్ధపడిపోయారు. ఫలితంగా మంగళవారం ఇద్దరు నేతలు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులోనే కన్నాపై చేసిన వ్యాఖ్యలను రాయపాటి వెనక్కు తీసుకున్పారు. కన్నా తన పరువు నష్టం దావా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కేసు విచారణ పూర్తి అయినట్లు కోర్టు ప్రకటించింది. 

  • Loading...

More Telugu News