Andhra Pradesh: రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు ఐఏఎస్ గిరిధర్

  • ఏపీ కేడర్ కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి గిరిధర్
  • కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి నుంచి రక్షణ శాఖ కార్యదర్శిగా బదిలీ
  • నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళి అర్పించి బాధ్యతల స్వీకరణ
telugu ias giridhar takes charge as defence secretary

కేంద్ర ప్రభుత్వంలో మరో తెలుగు ఐఏఎస్ అధికారి మంగళవారం కీలక బాధ్యతలు చేపట్టారు. ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఏ.గిరిధర్ రక్షణ శాఖ కార్యదర్శిగా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నిన్నటిదాకా కేంద్ర రవాణా శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన... తాజాగా మరింత కీలక శాఖ అయిన రక్షణ శాఖ కార్యదర్శిగా విధుల్లో చేరారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన అనంతరం ఆయన రక్షణ శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.


1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిధర్ ఉమ్మడి ఏపీలో పలు కీలక బాధ్యతల్లో పని చేశారు. ఖమ్మం, చిత్తూరు జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గానూ ఆయన విధులు నిర్వర్తించారు. అనంతర కాలంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. కేంద్రంలో తొలుత కేబినెట్ సెక్రటేరియట్ లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.

More Telugu News