tdp: అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేశ్

Tdp chief pays tribute to potti sriramulu photo
  • నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
  • టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
  • పొట్టి శ్రీరాములును స్మరించుకున్న టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని స్మరించుకున్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
అటు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇతర నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. 
   
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ... "1953కు ముందు మనం అందరం 'మద్రాస్' లో ఉండేవాళ్లం. మనల్ని మదరాసీలు అని పిలిచేవారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితమే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షతో అప్పటి ప్రభుత్వం దిగివచ్చింది. అనంతరం 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే క్రమంలో తెలంగాణ, ఆంధ్రను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అప్పుడు రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. 2014 తర్వాత ఆంధ్ర, తెలంగాణ విడిపోయాయి. భౌగోళికంగా ఒక రాష్ట్రంలో ఇన్ని మార్పులు జరగడం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే జరిగింది" అని వివరించారు.
    
మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ... "అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు పనిచేశారు. హైదరాబాద్ అభివృద్ధిలోనూ ఆంధ్ర ప్రజల పాత్ర విశేషమైంది" అని పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News