Ukraine: రష్యా దాడుల నేపథ్యంలో.. ఉక్రెయిన్ లో నీటికి కటకట

  • రష్యా దాడుల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు
  • విద్యుత్ స్టేషన్లు, నీటి సరఫరా కేంద్రాలపై మిసైళ్ల దాడి
  • రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో జనం ఇబ్బందులు
  • తాగునీటి కేంద్రాలకు క్యూ కట్టిన జనం  
Power and water supply hit across Ukraine in Russian missile strikes

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు కొత్త కష్టాలు తప్పట్లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాంబులు మీదపడతాయోననే భయం ఓవైపు పట్టిపీడిస్తూనే ఉంది. సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లడమే మానుకున్నారు. తాజాగా రష్యా దాడులతో మౌలిక సదుపాయాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలకు ఆటంకం తప్పడంలేదు. 

ఇటీవల రష్యా క్షిపణులతో విరుచుకుపడడంతో కీవ్, ఇతర నగరాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికార యంత్రాంగం దీనిని పునరుద్ధరించే ఏర్పాట్లలో ఉన్న సమయంలోనే సోమవారం మరోమారు రష్యా దాడులు చేసింది. సుమారు 50 క్షిపణులతో కీవ్, ఖార్కీవ్ లవీవ్, ఖేర్సన్, ఒడెసా తదితర నగరాలపై దాడి చేసింది. ఆయా నగరాల్లోని మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో చాలా నగరాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారుల చెప్పారు. ఈలోపు దగ్గర్లోని తాగునీటి కేంద్రాలకు జనం క్యూ కట్టారు.

కీవ్ లోనే 40 శాతం జనాభాకు నీళ్లు లేవు..
రష్యా దాడుల ప్రభావం కీవ్ లో ఎక్కువగానే ఉందని ఉక్రెయిన్ అధికార వర్గాల సమాచారం. సిటీలోని దాదాపు 40 శాతం జనాలకు తాగునీరు అందుబాటులో లేదని సిటీ మేయర్ చెప్పారు. నగరంలోని 2,70,000 అపార్ట్మెంట్లు విద్యుత్ సరఫరా లేక చీకట్లోనే మగ్గుతున్నాయని వివరించారు. ఉక్రెయిన్ ఆర్మీ కమాండ్ లతో పాటు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. 

ఇటీవల నల్లసముద్రంలో మోహరించిన రష్యా నౌకాదళంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ పేలుళ్ల వెనకున్నది ఉక్రెయిన్ అని నమ్మిన పుతిన్.. తాజాగా ప్రతీకార దాడులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, రష్యా నౌకాదళంపై డ్రోన్ దాడి తమపని కాదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా క్షిపణి దాడులను దీటుగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.

More Telugu News