Steel Man of india: ‘స్టీల్ మ్యాన్’ జంషెడ్ జే ఇరానీ కన్నుమూత

  • ఉక్కు రంగంలో నాలుగు దశాబ్దాల పాటు సేవలు
  • టాటా స్టీల్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఇరానీ
  • ఆయన సేవలకు గుర్తింపుగా 2007లో పద్మభూషణ్ పురస్కారం
Indias Steel Man Jamshed J Irani passes away at 86

భారత స్టీల్ మ్యాన్ (స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా) గా పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త జంషెడ్ జే ఇరానీ 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఉక్కు రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సేవలు అందించారు. దేశంలో ఉక్కు రంగంలో తొలి తరం పారిశ్రామికవేత్తగా ఉన్నారు. టాటా స్టీల్ లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన, 2011 జూన్ లో పదవీ విరమణ తీసుకున్నారు. 

1936 జూన్ 2న నాగ్ పూర్ లో ఆయన జన్మించారు. ఎంఎస్ సీ జియాలజీ కోర్సును 1958లో నాగ్ పూర్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. 1960లో మెటలర్జీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1963లో యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ నుంచి మెటలర్జీలో పీహెచ్ డీ డిగ్రీ అందుకున్నారు. అదే ఏడాది బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్ లో చేరారు. 1981లో టాటా స్టీల్ లో చేరి చివరి వరకు కంపెనీతోనే పనిచేశారు.

ఉక్కు రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. ఆయనకు భార్య దైసీ ఇరానీ తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇరానీ మృతి పట్ల టాటా స్టీల్ సంతాపం వ్యక్తం చేసింది.

More Telugu News