Twitter: ట్విట్టర్ కొత్త సీఈవో ఎవరో తనకు తెలియదంటున్న మస్క్

  • మాజీ సీఈవోను తొలగిస్తూ జారీ చేసిన పత్రాల్లో సీఈవోగా ఎలాన్ మస్క్ పేరు
  • ప్రస్తుతం ట్విట్టర్ బోర్డులో ఏకైక సభ్యుడిగా ఎలాన్
  • ఈ మార్పులు తాత్కాలికమే అంటున్న ప్రపంచ కుబేరుడు
Elon Musk says he doesnot know who the new Twitter CEO is but internal documents reveal a different story

ట్విట్టర్ కొత్త అధినేత ఎలాన్ మస్క్‌ ఆలోచన ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సంస్థను కొనుగోలు చేసిన తొలి రోజే మస్క్ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ను తొలగించారు. కానీ నూతన సీఈవోను మాత్రం నియమించలేదు. ట్విట్టర్ కొత్త సీఈవో ఎవరో ప్రస్తుతానికి తనకు కూడా తెలియదని మస్క్ చెబుతున్నారు. కానీ, పరాగ్ అగర్వాల్ తదితరులను తొలగిస్తూ ఆయన సంతకం చేసి జారీ చేసిన ఎస్ ఈసీ పత్రం మాత్రం వేరే కథను వెల్లడిస్తుంది. ఆ పత్రం ఎలాన్ మస్క్‌ను ట్విట్టర్ కొత్త  సీఈవోగా చూపిస్తోంది. 

కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మస్క్.. పరాగ్, లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ఓ నెల్ సెగల్‌ పై వేటు వేయడం సంచలనం సృష్టించింది. టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన తర్వాత మస్క్ ట్విట్టర్ బోర్డును రద్దు చేసి, కంపెనీకి ఏకైక డైరెక్టర్ అయ్యారు. అయితే, ఈ మార్పులు తాత్కాలికమే అని మస్క్ అంటున్నారు. ఈ లెక్కన ఆయన ట్విట్టర్ డైరెక్టర్ గా కూడా ఉండబోరని తెలుస్తోంది. అలాగే, సంస్థకు త్వరలోనే బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

మరోవైపు ట్విట్టర్ ధ్రువీకరణ ప్రక్రియలో కూడా మస్క్ భారీ మార్పులు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఖాతాను ధ్రువీకరించుకున్న వినియోగదారులు తమ బ్లూ టిక్ ను నిలుపుకోవడానికి నెలకు 20 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తం చెల్లించకపోతే బ్లూ టిక్ ను తొలగిస్తారు. ట్విట్టర్ లో ప్రస్తుతం 7500 మంది పని చేస్తున్నారు. మస్క్ 75 శాతం సిబ్బందిని తొలగిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ, వీటిని మస్క్ ఖండించారు.

More Telugu News