Telangana: కొడుకు వేధింపులు భరించలేక.. రూ. 8 లక్షల సుపారీ ఇచ్చి చంపించిన తల్లిదండ్రులు

  • వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను హింసిస్తున్న కుమారుడు
  • కన్నతల్లితోనూ అనుచిత ప్రవర్తన
  • విసిగిపోయి కిరాయి హంతకులతో హత్య చేయించిన తల్లిదండ్రులు
  • ఖమ్మంలో ఘటన
Parents killed his son for not bearing his Harassment in Khammam

వ్యసనాలకు బానిసై కొడుకు పెట్టే బాధలు భరించలేని తల్లిదండ్రులు కిరాయి హంతకుల ద్వారా అతడిని హతమార్చారు. ఖమ్మంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్-రాణిబాయి దంపతులకు సాయిన్ (26), కుమార్తె సంతానం. సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో రామ్‌సింగ్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. డిగ్రీ చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టిన సాయినాథ్ వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల కన్నతల్లితోనూ అనుచితంగా ప్రవర్తించాడు. నాలుగేళ్లుగా కుమారుడి వేధింపులు భరిస్తున్న తల్లిదండ్రులు ఇక సహించలేకపోయారు. అతడిని తుదముట్టించడమే పరిష్కారమని భావించారు. 

కుమారుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్న రామ్‌సింగ్ దంపతులు నల్గొండ జిల్లా మిర్యాగూడలో ఉంటున్న రాణిబాయి తమ్ముడు సత్యనారాయణసింగ్‌కు ఈ విషయం చెప్పారు. మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ రమావత్ రవికి విషయం చెప్పిన సత్యనారాయణ సింగ్.. సాయినాథ్‌ను అంతమొందించాలని కోరాడు. దీంతో రమావత్ రవి అదే తండాకు చెందిన పనుగోతు నాగరాజు, బూరుగు రాంబాబు, త్రిపురారం మండలం రాజేంద్రనగర్‌కు చెందిన ధనావత్‌లతో రవి రూ. 8 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. 

ప్లాన్‌లో భాగంగా అక్టోబరు 18న సత్యనారాయణసింగ్, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ ఆలయం వద్ద దావత్ చేసుకుందామని సాయినాథ్‌ను నమ్మించి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం సాయినాథ్ మెడకు ఉరి బిగించి చంపేశారు. ఆ తర్వాత సాయినాథ్ కారులోనే శవాన్ని తీసుకెళ్లి మూసీనదిలో పడేశారు. ఆ తర్వాతి రోజు నదిలో శవం తేలడంతో స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఆ తర్వాత మూడు రోజులకు మీడియా ద్వారా విషయం తెలిసిందంటూ సాయినాథ్ శవాన్ని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. మరోవైపు, హత్యకేసును విచారిస్తున్న పోలీసులకు హత్య జరిగిన రోజు శూన్యంపహాడ్ వద్ద  సీసీటీవీలో కనిపించిన కారు, మృతుడి తల్లిదండ్రులు తీసుకొచ్చిన కారు ఒకటేనని గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసుల ఎదుట నిజాన్ని అంగీకరించారు. కుమారుడి వేధింపులు భరించలేకే తామే అతడిని హత్య చేయించినట్టు అంగీకరించారు. సాయినాథ్ తల్లిదండ్రులు, మేనమామతోపాటు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

More Telugu News