Morbi Bridge Tragedy: మోదీజీ.. ఇప్పుడేమంటారు?.. ‘మోర్బీ ఘటన’ నేపథ్యంలో పాత వీడియోలు చూపిస్తూ విపక్షాల ఫైర్

  • 2016లో పశ్చిమ బెంగాల్‌లో కూలిన బ్రిడ్జి
  • అవినీతి వల్లే కూలిందంటూ మమతపై మోదీ ఫైర్
  • ఆ వీడియోను పోస్టు చేస్తూ విరుచుకుపడుతున్న విపక్షాలు
  • చనిపోయిన వారి కోసం నాలుగు చుక్కల కన్నీరైనా కారుస్తారా? అని ప్రశ్న 
opposition parties shares videos of modi who fires on mamata on brdge collapse

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై వున్న తీగల వంతెన కూలిన ఘటనలో 132 మందికిపైగా మృతి చెందిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. 31 మార్చి 2016లో పశ్చిమ బెంగాల్‌లో నిర్మాణంలో ఉన్న వివేకాంద రోడ్ ఫ్లై ఓవర్ కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

 అప్పట్లో ఎన్నికల ప్రచారం కోసం బెంగాల్ వచ్చిన ప్రధాని.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బ్రిడ్జి కూలిపోతే ఇది దేవుడు చేసిన పని అని అంటున్నారని, ఇది దేవుడు చేసిన పని కాదని, అవినీతి చర్య అని అన్నారు. అవినీతి ఫలితంగానే బ్రిడ్జి కూలిపోయిందని, ఇది సిగ్గుచేటంటూ మమతను తూర్పారబట్టారు. 

తాజాగా మోర్బీ బ్రిడ్జి విషాదంపై స్పందించిన విపక్షాలు.. మోదీ అప్పట్లో మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ ఎదురుదాడికి దిగాయి. ఇప్పుడేమంటారు మోదీజీ? అని టీఎంసీ, శివసేన నిలదీశాయి. ఈ దుర్ఘటనకు సొంత పార్టీదే బాధ్యతన్న విషయాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించాయి. కోల్‌కతా ఫ్లైఓవర్ కూలిపోయినప్పుడు మమతను మోదీ తప్పుబట్టారని, గుజరాత్‌లో పునరుద్ధరించిన బ్రిడ్జి కూలిపోయిన ప్రమాదంలో 132 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నాయి. ఇంతమంది చనిపోయినందుకు కనీసం నాలుగు చుక్కల కన్నీరైనా కారుస్తారా మోదీజీ? అని టీఎంసీ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు.

శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కూడా మోదీపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో బ్రిడ్జి కూలిపోతే అది దేవుడి పని కాదని, అవకతవకలే కారణమన్న మోదీ ప్రసంగం తనకు గుర్తుకొస్తోందని అన్నారు. ఇది సున్నితత్వం లేని, నిర్లక్ష్యంతో కూడిన చర్య కావడంతో తాను ఆ వీడియోను పోస్టు చేయడం లేదని ప్రియాంక పేర్కొన్నారు. 

More Telugu News