Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కిన కాంట్రాక్టుపై ఆయన కుమారుడు సంకీర్త్ రెడ్డి వివరణ ఇదిగో

  • ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి
  • తన సంస్థకు ఇటీవలే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందని వెల్లడి
  • ఈ ప్రకటనలో రాజగోపాల్ రెడ్డిపై వైరివర్గాల విమర్శలు
  • తమకు ఆ కాంట్రాక్టు ఎలా వచ్చిందో వివరించిన సుశీ ఇన్ ఫ్రా ఎండీ సంకీర్త్ రెడ్డి
Komatireddy Sankeerth Reddy explanation on how sushee infra gets the contract

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ కంపెనీకి ఇటీవలే రూ.18 వేల కోట్ల విలువ కలిగిన కాంట్రాక్టు దక్కిందంటూ ఆయన స్వయంగా వెల్లడించారు. 

ఈ విషయాన్ని పట్టుకున్న వైరి వర్గాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నుంచి లోపాయికారిగా వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టు దక్కినందునే ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఇదివరకే కోమటిరెడ్డి వివరణ ఇచ్చినా...తాజాగా ఆయన కుమారుడు, సుశీ ఇన్ ఫ్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంకీర్త్ రెడ్డి సోమవారం ఓ వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఈ వివరణలో సంకీర్త్ రెడ్డి... తమకు దక్కిన కాంట్రాక్టుకు సంబంధించిన కాపీని కూడా జత చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. సంకీర్త్ రెడ్డి పోస్ట్ ప్రకారం ఝార్ఖండ్ లోని చంద్రగుప్త్ కోల్ మైన్ బొగ్గు గనుల తవ్వకానికి గ్లోబల్ టెండర్లను 2020 జూన్ 30న ఆహ్వానించింది. ఈ టెండర్ కు స్పందించిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, అరబిందో, మహాలక్ష్మీ, ట్రైడెంట్ కన్సార్టియం, మాంటెకార్లో లిమిటెడ్ లు తమ బిడ్లను దాఖలు చేశాయి. వీటిలో అదానీ గ్రూప్ అతి తక్కువకు కోట్ చేసినా... ఈ ధరలు ఆమోదయోగ్యం కాదని సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (సీసీఎల్) ఆ టెండర్లను రద్దు చేసింది.

అయితే అదే పనికి 2021 ఫిబ్రవరి 30న సీసీఎల్ మరోమారు గ్లోబల్ టెండర్లను పిలుస్తూ పాత ప్రకటనను యథాతథంగా జారీ చేసింది. ఈ టెండర్ నోటీస్ కు గతంలో బిడ్లను దాఖలు చేసిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, మాంటెకార్లో లిమిటెడ్ తో పాటు సుశీ ఇన్ ఫ్రా కూడా బిడ్ ను దాఖలు చేసింది. బిడ్లను తెరచిన సీసీఎల్ ఎల్1 (అతి తక్కువ ధరను కోట్ చేసిన కంపెనీ)గా నిలిచిన సుశీ ఇన్ ఫ్రాను చర్చల కోసం ఆహ్వానించింది. టెండర్ బిడ్ లో టన్నుకు రూ.648 కోట్ చేసిన సుశీ ఇన్ ఫ్రా కేంద్రంతో జరిగిన చర్చల్లో మరింత తక్కువ ధర టన్నుకు రూ.538.29కే ఒప్పుకుంది. దీంతోనే సుశీ ఇన్ ఫ్రాకు ఈ టెండర్ దక్కిందని సంకీర్త్ రెడ్డి చెప్పారు.

More Telugu News