Kalva Srinivasulu: మేధావుల ముసుగులో జగన్ జీతగాళ్లు ఉన్నారు... విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: కాల్వ శ్రీనివాసులు

  • రాయలసీమ అంశంపై కాల్వ శ్రీనివాసులు ప్రెస్ మీట్
  • జేఏసీ ముసుగులో కుట్రలు చేస్తున్నారని విమర్శలు
  • రాయలసీమకు తీరని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆగ్రహం
  • రాజకీయ కుట్రల్ని భగ్నం చేయాలని పిలుపు
Kalva Srinivasulu press meet on Rayalaseema development

ప్రాంతీయ చిచ్చుతో చలికాచుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జేఏసీ ముసుగులో వైసీపీ నాయకులు చేస్తున్న రాజకీయ కుట్రల్ని భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. 

అధికారం వైసీపీ చేతుల్లోనే ఉందని, అభివృద్ధి చేయాల్సిన వారే, దాన్ని విస్మరించి కొత్తగా ప్రాంతీయ విభేదాలు, విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. మేధావుల ముసుగులో జగన్ జీతగాళ్లు ఉన్నారని విమర్శించారు. 

"రాష్ట్రాన్ని  పరిపాలించమని అధికారాలు, అవకాశమిస్తే ఆ అవకాశాలను స్వార్థానికి మార్చుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధికారంలో ఉండి కూడా రాయలసీమకు అన్యాయం జరిగిందని ర్యాలీ చేయడం, ఆక్రోశాన్ని వెళ్లగక్కడం ఏంటి?  1937 శ్రీ బాగ్ ఒడంబడిక అమలు జరగడంలేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ ఒప్పందంలోని అంశాలను అమలు చేయొద్దని ఎవరూ అనలేదు. ఎవరు అభివృద్ధి నిరోధకులుగా మారారో ప్రజలు గ్రహిస్తున్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాయలసీమ ప్రాజెక్టు పనులు పడకేశాయి. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలు జగన్ ను రాయలసీమను అభివృద్ధి చేయండని ఎందుకు అడగలేదు. కడపలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనంతపురంలో వెంకటరామిరెడ్డి లు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతారే కానీ.. జగన్ ను ఎందుకు అడగరు? 

చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాజెక్టులకు 5 సంవత్సరాల్లో రూ.10,747 కోట్లు ఖర్చు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఈ మూడున్నర సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రాయలసీమ గొంతు కోశారు. కేసీఆర్ తో అంటకాగుతూ రాయలసీమకు తీరని ఇబ్బందులు సృష్టించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే కోట్ల రూపాయల ఆదాయం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టారు. 

తాత, తండ్రి అనేక దశాబ్దాలుగా రాయలసీమ పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. జగన్ కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. పురుషోత్తమరెడ్డి లాంటి కొంతమంది కుహనా మేధావులు, జగన్ జీతగాళ్లు వైసీపీ పంచన చేరి సాగిస్తున్న దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతాం. 

వీళ్ల కుట్రలను బద్దలు కొడదాం... జగన్ కు బుద్ధి చెబుదాం. జరుగుతున్న పరిణామాలు, జేఏసీ ముసుగులో వైసీపీ నాయకులు సాగిస్తున్న దుర్మార్గాలపట్ల రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి" అంటూ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. 

More Telugu News