లివర్ జబ్బున పడుతుందనడానికి సంకేతాలు ఇవే..!

  • పెరిగిపోతున్న ఫ్యాటీ లివర్ ముప్పు
  • మగతగా ఉండడం, అస్పష్టమైన మాటలు దీని సంకేతాలే
  • ఆల్కహాల్, మద్యపానం, అధిక బరువుతో ఈ సమస్య
  • ఆలస్యం చేస్తే లివర్ సిర్రోసిస్ ప్రమాదం
Fatty Liver Disease Signs That Can Indicate Severity

కాలేయం చేసే పనులు బోలెడు. మన రక్తంలో ఉండే ఎన్నో కెమికల్స్ ను కాలేయం నియంత్రిస్తుంటుంది. బైల్ అనే ఉత్పత్తిని విడుదల చేస్తుంది. కాలేయంలో ఉన్న వ్యర్థాలను ఇది బయటకు పంపిస్తుంటుంది. శరీరానికి ప్రొటీన్ ను కూడా తయారు చేస్తుంది. ఐరన్ ను నిల్వ చేయడం, పోషకాలను శక్తిగా మార్చడం చేస్తుంది. 


ఫ్యాటీ లివర్ అంటే పేరులో ఉన్నట్టుగా కాలేయంలో ఫ్యాట్ అధికంగా చేరిపోతుంది. దీంతో కాలేయం సాధారణ పనితీరుకు విఘాతం కలుగుతుంది. పలు సమస్యలు కనిపిస్తాయి. ఆల్కహాల్ కారణంగా ఏర్పడే ఫ్యాటీ లివర్ ఒకటి కాగా, ఆల్కహాల్ తో సంబంధం లేకుండా ఏర్పడేది మరో రకం. ఫ్యాటీ లివర్ అన్నది లివర్ సిర్రోసిస్ సమస్యకు దారితీసే ప్రమాదం ఉంటుంది. లివర్ సిర్రోసిస్ అన్నది ప్రాణాంతక వ్యాధి. కాలేయం దెబ్బితినడాన్ని సిర్రోసిస్ గా చెబుతారు. సిర్రోసిస్ అంటే కాలేయంపై మచ్చలతో కూడిన పొర ఏర్పడడం. దీన్నే ఫైబ్రోసిస్ అని కూడా చెబుతారు. ఇన్ ఫ్లమేషన్ కారణంగా కాలేయంలో మరింత భాగానికి ఫైబ్రోసిస్ విస్తరిస్తుంది. 

సంకేతాలు
ఫ్యాటీ లివర్ సమస్య ఉందని చెప్పడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయోమయం, మగత, అస్పష్టమైన మాటలు, హెపటిక్ ఎన్ సెఫలోపతిని సంకేతాలుగా మాయో క్లినిక్ పేర్కొంది. కడుపులో ద్రవాలు పేరుకుపోతుంటాయి. అన్న వాహికలోని నరాలు ఉబ్బుతాయి. ఇవి పగిలి రక్తస్రావం కావచ్చు. అలాగే, లివర్ కేన్సర్, చివరి దశ లివర్ వైఫల్యానికి దారితీయవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య ముదిరిన దశలో కడుపులో వాపు, రక్తనాళాలు, ప్లీహం పెరుగుతాయి. చర్మం, కళ్లు కామెర్ల మాదిరి పసుపు రంగులోకి మారతాయి. 

కారణాలు
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఇది కాకుండా స్థూల కాయం, టైప్-2 డయాబెటిస్, థైరాయిడ్ గ్రంధి పనితీరులో మార్పులు, ఇన్సులిన్ నిరోధకత, అధిక రక్తపోటు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధి, పొగతాగడం ఈ సమస్య బారిన పడడానికి కారణాలుగా ఉన్నాయి.

More Telugu News