Probiotics: ప్రోబయోటిక్స్.. పిల్లలకు రక్షణ వలయం

  • పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి జరుగుతుంది
  • ఇన్ఫెక్షన్ల బారిన పడిన తర్వాత త్వరగా కోలుకునేందుకు కీలకం
  • మజ్జిగ, పెరుగు రూపంలో సహజ సిద్ధంగా ప్రోబయోటిక్స్
Probiotics can help your children stay healthy

పిల్లలకు ప్రోబయోటిక్స్ ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలుసా..? పిల్లల ఆరోగ్యం బాగుండడానికి ప్రోబయోటిక్స్ సాయపడతాయి. ప్రోబయోటిక్స్ అంటే మంచి సూక్ష్మజీవులు. ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరితే చెడు బ్యాక్టీరియాపై పోరాడి, మన ఆరోగ్యాన్ని కాపాడే ఫైటర్స్ లా పనిచేస్తాయి. 


ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ప్రోబయోటిక్స్ కేవలం పేగుల ఆరోగ్యానికే కాదు, మెదడు అభివృద్ధికీ తోడ్పడతాయి. గ్యాస్ట్రో ఎంటరైటిస్ సమస్య రాకుండా చూస్తాయి. ప్రోబయోటిక్స్ లో లాక్టోబాసిల్లస్ రామ్నోసర్, శాచ్ రో మైసెస్ బౌలార్డి అనే సూక్ష్మజీవులు ఉంటాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు యాంటీబయోటిక్స్ వాడుతుంటాం. దీని కారణంగా పేగుల్లో మనకు మంచి చేసే బ్యాక్టీరియా చనిపోతుంది. దీని కారణంగా అతిసారం రావచ్చు. ఆ సమయంలో ప్రోబయోటిక్స్ ఇవ్వడం ఎంతో కీలకం. 

ఇంకా ఇన్ఫెక్షన్లు, జీర్ణాశయ సమస్యలు, శ్వాసకోస ఇన్ఫెక్షన్లు అన్నవి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఏదైనా వ్యాధి బారిన పడి పిల్లలు త్వరగా కోలుకోవడానికి ప్రోబయోటిక్స్ (ఎల్ జీజీ, ఎస్ బౌలార్డి) ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది. లాక్టోస్ కొంత మందికి పడదు. అటువంటి వారు పాలు తీసుకోవడానికి ఇష్టం చూపించరు. ఈ సమస్యను కూడా ప్రోబయోటిక్స్ పరిష్కరిస్తాయి. పిల్లల దంతాలకు కూడా ప్రోబయోటిక్స్ తో రక్షణ ఉంటుంది. తిన్న ఆహార పదార్థాల విడిభాగాలు దంతాల్లో మిగిలిపోయి, ఆ తర్వాత చెడిపోవడం వల్ల బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ హానికారక బ్యాక్టీరియాపై ప్రోబయోటిక్స్ పోరాడతాయి.

ఏ రూపంలో..
ప్రోబయోటిక్స్ పెరుగు, యోగర్ట్ (గడ్డ పెరుగు), మజ్జిగలో పుష్కలంగా లభిస్తాయి. ఇది సహజసిద్ధ మార్గం. ప్రోబయోటిక్స్ సప్లిమెంట్ల రూపంలోనూ లభిస్తాయి. కానీ వాటితో పోలిస్తే సహజ ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడమే మంచిది. ఫ్రీజర్ లో పెట్టిన పెరుగు, మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉండవు. పాలను తోడేస్తే పెరుగుగా మారేందుకు సాయపడేవే సూక్ష్మజీవులు. ఆ పెరుగు తోడుకున్న తర్వాత నుంచి ఈ సూక్ష్మ జీవుల సంఖ్య భారీగా పెరిగిపోతుంటుంది. అది పేగులకు మంచిది. పెరుగును మజ్జిగగా చేసుకుని కొద్ది సమయం తర్వాత తీసుకున్నా పుష్కలంగా లభిస్తాయి. శిశువులకు తల్లిపాల ద్వారా పుష్కలమైన ప్రోబయోటిక్స్ అందుతాయి. అందుకే వారికి తల్లిపాలు పట్టించడం అత్యంత ముఖ్యం.

More Telugu News