Bhuvneshwar Kumar: ఫీల్డింగ్‌లో మెరుగ్గా వ్యవహరించలేకపోయాం.. అదే దెబ్బతీసింది: భువనేశ్వర్ కుమార్

  • మార్కరమ్‌ను అవుట్ చేసే అవకాశాలను చేజేతులా మిస్‌ చేసుకున్న భారత్
  • బౌలర్ల కృషిని నీరుగార్చిన ఫీల్డింగ్ వైఫల్యాలు
  • 18వ ఓవర్‌ను అశ్విన్‌తో వేయించడాన్ని సమర్థించిన భువీ
If we had taken our chances in the field it could have been different says Bhuvneshwar

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. లక్ష్యం చిన్నదే అయినా పొదుపుగా బౌలింగ్ చేసిన ఇండియన్ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. అయితే, ఫీల్డింగ్ తప్పిదాలు వారి కృషిని నీరు గార్చాయి. మ్యాచ్‌ను వీక్షించిన వారికి ఈ విషయం బాగా అర్థమై ఉంటుంది. 

ఈ నేపథ్యంలో, బౌలర్ల కృషికి మెరుగైన ఫీల్డింగ్ తోడై ఉంటే ఫలితం మరోలా ఉండేదని టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. 12వ ఓవర్‌లో మార్కరమ్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ జారవిడిచాడు. లైఫ్ దొరకడంతో చెలరేగిన మార్కరమ్ అర్ధ సెంచరీ (52) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 13వ ఓవర్‌లో మార్కరమ్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని రోహిత్ మిస్ చేసుకున్నాడు. అంతేకాదు, అంతకుముందు 9వ ఓవర్‌లో మార్కరమ్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ మిస్ చేశాడు. అప్పుడు సౌతాఫ్రికా స్కోరు 36 పరుగులే. 

క్యాచ్‌లు, రనౌట్‌లు మిస్ చేసుకోవడం ఫలితాన్ని తారుమారుచేసిందని భువీ పేర్కొన్నాడు. అలాగే, పిచ్‌ నుంచి వచ్చిన ఎక్స్‌ట్రా పేస్‌, బౌన్స్‌ భారత టాపార్డర్‌ను దెబ్బతీసిందన్నాడు. బ్యాటింగ్‌కు వికెట్ అనుకూలంగా లేదన్న విషయం తెలుసని అన్నాడు. ఈ టోర్నమెంటులో కనుక చూస్తూ 140 పరుగుల స్కోరు మంచి లక్ష్యమేనని అన్నాడు. తాము కూడా అదే నమ్మినట్టు చెప్పాడు. ఈ మ్యాచ్‌లోనూ కనీసం అంత స్కోరును ప్రత్యర్థి ఎదుట ఉంచాలని భావించినట్టు చెప్పాడు. 

18వ ఓవర్‌ వేసేందుకు అశ్విన్‌ చేతికి రోహిత్ బంతి ఇవ్వడంపై భువీ మాట్లాడుతూ.. అది మంచి నిర్ణయమేనన్నాడు. అప్పుడు బ్యాటర్లను స్పిన్నర్లు అడ్డుకుంటే చివరి ఓవర్‌లో పేసర్లను ఆడడం బ్యాటర్లకు ఇబ్బంది అవుతుందన్నాడు. స్పిన్నర్లను చివరి ఓవర్‌లో దించితే బ్యాటర్లకు ఈజీ అయిపోతుందన్నాడు. అశ్విన్‌కు బంతి ఇవ్వడానికి ముందు రోహిత్‌కు ఉన్న ఆప్షన్ దీపక్ హుడా మాత్రమేనని పేర్కొన్నాడు. కాబట్టే అశ్విన్‌కు బంతి ఇచ్చినట్టు పేర్కొన్నాడు. 14వ ఓవర్‌లో అశ్విన్ 17 పరుగులు సమర్పించుకున్నప్పటికీ 18వ ఓవర్‌ను తిరిగి అతడితో వేయించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కీలకమైన ఆ ఓవర్‌లో అశ్విన్ ఓ వికెట్ తీసినప్పటికీ 13 పరుగులు సమర్పించుకోవడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది.

More Telugu News