Prashant Kishor: నితీశ్ కుమార్, జగన్ ల కోసం పనిచేయడానికి బదులుగా కాంగ్రెస్ పునరుజ్జీవానికి పాటుపడి ఉండాల్సింది: ప్రశాంత్ కిశోర్

  • తనకు ఈ విషయం ఆలస్యంగా అర్థమైందన్న పీకే
  • బీహార్‌లో నితీశ్‌తో ఎందుకు కటీఫ్ చేసుకున్నదీ చెప్పిన రాజకీయ వ్యూహకర్త
  • ఆగస్టు 15న 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టిన పీకే
RSS real coffee BJP just the frothy top says Prashant Kishore

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ కోసం పని చేయకుండా, కాంగ్రెస్ పునరుజ్జీవానికి తాను కృషి చేసి ఉంటే బాగుండేదని అన్నారు. అసలైన ‘మహాత్మాగాంధీ కాంగ్రెస్’కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తనకు ఆలస్యంగా అర్థమైందన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం ‘జన్ సురాజ్’ పేరుతో మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా నుంచి 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు పీకే శ్రీకారం చుట్టారు. మహాత్మాగాంధీ 1917లో ఇక్కడి నుంచి మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. 

తాజాగా, ఈ యాత్ర నిన్న జిల్లాలోని లౌరియాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీని అర్థం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించడం కష్టమని విపక్ష కూటమికి సూచించారు. ఓ కప్పులో ఉండే పైపై నురుగే బీజేపీ అయితే.. దానికింద ఉండే అసలైన కాఫీయే ఆరెస్సెస్ అని అన్నారు. సామాజిక వ్యవస్థలో అది భాగమైపోయిందని, షార్ట్‌కట్స్‌తో దానిని ఓడించలేమన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టసవరణ బిల్లుకు జేడీయూ ఎంపీలు పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేసిన విషయం తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు. ఆ తర్వాత ఇదే విషయమై నితీశ్‌ను నిలదీశానని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ అమలు కానివ్వనని హామీ ఇచ్చారని అన్నారు. నితీశ్ కుమార్ ఈ రెండు నాల్కల ధోరణి చూసిన తర్వాత ఆయనతో కలిసి పనిచేయలేనని తనకు అర్థమైందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

More Telugu News