Twitter: మస్క్ దెబ్బకు ట్విట్టర్లో మరిన్ని వికెట్లు డౌన్!

  • పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని మస్క్ నిర్ణయం
  • ఈ మేరకు జాబితా సిద్ధం చేయాలని మేనేజర్లకు హుకుం
  • విభాగాలను బట్టి ఉద్యోగాల్లో కోత పడే అవకాశం
Elon Musk Asks Twitter Managers For List Of People To Be Laid Off Report

అనేక చర్చల తర్వాత ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ సంస్థ సీఈఓ, సీఎఫ్ఎ సహా ఇతర కీలక పదవుల్లో ఉన్న పలువురు ప్రముఖుల్ని తొలగించి షాకిచ్చారు. ఆయన అంతటితో ఆగడం లేదు. ఇప్పుడు ట్విట్టర్ లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోత పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సంబంధిత మేనేజర్లను కోరినట్టు తెలుస్తోంది. 

వివిధ దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగుల విభాగాలను బట్టి ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఉంటుందని ట్విట్టర్ లో కీలక అధికారి చెబుతున్నారు. అవసరం లేదనుకుంటున్న కొన్ని విభాగాల్లో ఎక్కువ మందిని ఇంటికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్విట్టర్ లో ఉద్యోగుల సంఖ్యను కుదించాల్సిన అవసరం ఉందని దాని కొనుగోలు డీల్ కుదిరినప్పటి నుంచి మస్క్ చెబుతున్నారు. ఏకంగా 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని ఆయన చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. తర్వాత అందులో వాస్తవం లేదని మస్క్ వాటిని కొట్టి పారేశారు. కానీ, ఇప్పుడు తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ట్విట్టర్ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.

More Telugu News