BCCI president: పాకిస్థాన్ సెమీస్ కు చేరడం కష్టమే: బీసీసీఐ చీఫ్

  • తాను కూడా అదే కోరుకుంటున్నానన్న బీసీసీఐ చీఫ్
  • క్రికెట్ లో ఏదైనా సాధ్యమేనన్న అభిప్రాయం
  • చిన్న జట్లను తేలిగ్గా తీసుకోవడానికి లేదని కామెంట్
BCCI president makes massive Pakistan prediction for T20 World Cup

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ జట్టును.. ఆ వెంటనే జింబాబ్వే సైతం మట్టికరిపించడం తెలిసిందే. దీంతో పాక్ జట్టుపై సొంత గడ్డ నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పాకిస్థాన్ పై జింబాబ్వే చిరస్మరణీయ విజయంపై రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. పాక్ వరుస ఓటముల నేపథ్యంలో చివరి నాలుగు జట్లలో చోటు సంపాదించడం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘జూనియర్ జట్లు బలంగా ముందుకు వస్తుండడం మంచిదే. ఈ విడత టీ20 ప్రపంచకప్ లో ఐర్లాండ్, జింబాబ్వే తామేంటో నిరూపించుకున్నాయి. 

కనుక ఇక మీదట చిన్న జట్లను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అవి తేలిగ్గా ఓడించగలవు. నా అభిప్రాయం ప్రకారం సెమీ ఫైనల్స్ కు చేరుకోవడం పాకిస్థాన్ కు కష్టమే. అదే జరిగితే నేను ఎంతో సంతోషిస్తాను. అదే జరగాలని కోరుకుంటున్నాను. కానీ క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. మీకు తెలియదు కానీ, అది ఎప్పటికైనా జరగొచ్చు’’అని బిన్నీ పేర్కొన్నారు. గ్రూప్ బీలో బంగ్లాదేశ్ ఇప్పటికే తన ఖాతాలో రెండు విజయాలు వేసుకుని పాయింట్ల పట్టికలో భారత్ తర్వాతి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా కూడా బలంగానే ఉంది. వరుస ఓటములతో మానసికంగా కుదేలైన పాకిస్థాన్ తన తర్వాతి మ్యాచుల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

More Telugu News