రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోవడం వల్లే మునుగోడుకు ఉప ఎన్నిక: మంత్రి కేటీఆర్
- కాంట్రాక్ట్ విషయం స్వయంగా తనే చెప్పాడన్న మంత్రి
- నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి అలవాటేనన్న కేటీఆర్
- బీఆర్ ఎస్ ను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తోందని ఆరోపణలు
ప్రతిపక్ష పార్టీల నేతలను కేసులు, విచారణ సంస్థల దాడులతో బెదిరించడం, ఆపై పార్టీలో చేర్చుకుని అప్పటికే ఉన్న కేసులను కూడా కొట్టేయించడం బీజేపీ నైజమని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రమేష్, సుజనా చౌదరిపై కేసులు పెట్టారని, బీజేపీలోకి వెళ్లగానే వారిపై కేసులు మాయం అయ్యాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమేనని, మంచి భవిష్యత్తు కావాలనుకునే నేతలు టీఆర్ఎస్ లోకి వస్తారని కేటీఆర్ చెప్పారు. బెదిరింపులకు భయపడే నేతలు బీజేపీలోకి వెళతారని అన్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడడమే తప్ప మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేంటని అడిగితే రాష్ట్రంలోని బీజేపీ నేతలు జవాబివ్వలేరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత ఐదు నెలల కాలంలో గుజరాత్ కు కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులు రూ.లక్ష కోట్లని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వరదల వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినా కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.