2.3 feet: వధువు 3 అడుగులు, వరుడు 2.3 అడుగులు.. పెళ్లికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి ఆహ్వానం!

  • ఢిల్లీ వెళ్లి మోదీతో పాటు యోగికి ఆహ్వాన పత్రిక ఇస్తానంటున్న ఉత్తరప్రదేశ్ నివాసి అజీమ్
  • ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత కుదిరిన పెళ్లి
  • వచ్చే నెల 7వ తేదీన ఒక్కటవనున్న చిరు జంట
2 and 3 Foot Tall Man From UP Wants To Invite PM and Yogi Adityanath To His Wedding

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన అజీమ్ మన్సూరి అనే వ్యక్తి తన వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఆహ్వానించాలనుకుంటున్నారు. ఇందులో విశేషం ఏముంది? అనుకుంటున్నారా? ఉంది. అజీమ్ కు ఓ స్పెషాలిటీ ఉంది. అతని ఎత్తు 2.3 అడుగుల మాత్రమే. ఈ ఏడాది నవంబర్‌లో తను పెళ్లి చేసుకోబోతున్నాడు. తను పెళ్లి చేసుకోబోయే వధువు ఎత్తు 3 అడుగులు కావడం విశేషం. 

తమ పెళ్లికి ప్రధానితో పాటు యూపీ సీఎం హాజరుకావాలని అజీమ్ కోరుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లి మోదీతో పాటు యోగి ఆదిత్యనాథ్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తానని అజీమ్ చెబుతున్నాడు. మరుగుజ్జు కావడంతో పెళ్లికూతురు కోసం తను చాలా సంవత్సరాలగా వెతికాడు. ఈ విషయంలో తనకు సాయం చేయాలని పలువురు రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను కూడా కలిసి విజ్ఞప్తి చేశాడు.

తనకు పిల్లను చూసి పెట్టాలంటూ 2019లో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిశాడు. ఐదో తరగతితో చదువు ఆపేసిన మన్సూరికి చాలా సంవత్సరాల పోరాటం తర్వాత హాపూర్ గ్రామంలో అతనికి వధువు దొరికింది. గతేడాది మార్చిలో 3 అడుగుల పొడవున్న బుషారాను కలిశాడు. అదే ఏడాది  ఏప్రిల్ లో వీళ్ల నిశ్చితార్థం జరిగింది. అయితే, బుషారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. 

నవంబర్ 7న వీళ్ల పెళ్లి జరగనుంది. పెళ్లికి మన్సూరి ప్రత్యేకమైన షేర్వానీ, త్రీ-పీస్ సూట్‌ను కుట్టించుకున్నాడు. చిన్నప్పుడు పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మన్సూరి ధైర్యంగా నిలబడ్డాడు. షామ్లీ జిల్లాలో ఒక సౌందర్య సాధనాల దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

More Telugu News