Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు వీడియోలు తీసి బెదిరిస్తున్నాడు!

Husband Warns Wife With Personal Photos
  • హైదరాబాద్ ఎస్సార్ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన
  • సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తున్న భర్త
  • పలు దఫాలుగా రూ. 4 లక్షలు ఇచ్చిన భార్య
  • అయినా వేధిస్తుండడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ప్రేమిస్తున్నానన్నాడు.. నువ్వు లేకుండా ఉండలేనన్నాడు. అతడి ప్రేమకు ఆమె చలించిపోయింది. అతడితో కలిసి జీవితాన్ని పంచుకునేందుకు సరేనంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి సాక్షిగా వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెట్టాడు. ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన ఓ మహిళ (26) ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నిఖిల్ (25) అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో గతేడాది నవంబరులో పెద్దమ్మతల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. 

పెళ్లి తర్వాత మూడు నెలలపాటు ఎవరి ఇంట్లో వారు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కలిసి ఉంటున్నారు. ఆ తర్వాతి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పనిపాట లేకుండా ఖాళీగా ఉంటున్న నిఖిల్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నాడు. అయినప్పటికీ వేధింపులు కొనసాగించాడు. 

ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించి డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. అడిగినంత ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. అతడి వేధింపులు శ్రుతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు నిన్న ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Crime News
SR Nagar Police Station

More Telugu News