Britain: రిషి సునాక్ మరో కీలక నిర్ణయం.. విదేశీ సాయం రెండేళ్లపాటు నిలిపివేత!

  • తన జాతీయ ఆదాయంలో 0.5 శాతాన్ని విదేశీ సాయం కోసం వినియోగిస్తున్న బ్రిటన్
  • కరోనా సంక్షోభం నేపథ్యంలో రెండేళ్ల క్రితం సాయం నిలిపివేత
  • పరిస్థితులు మెరుగుపడకపోవడంతో 2027 వరకు నిలిపివేతకు నిర్ణయం?
UK PM Rishi Sunak could freeze foreign aid for two more years

బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్‌ను అందులోంచి గట్టెక్కించేందుకు నడుంబిగించిన సునాక్.. విదేశీ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బ్రిటన్ తన మొత్తం జాతీయ ఆదాయంలో 0.5 శాతాన్ని విదేశీ సాయం కోసం వినియోగిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ రెండేళ్ల క్రితం విదేశీ సాయాన్ని నిలిపివేసింది. సంక్షోభం నుంచి ఇంకా బయటపడకపోవడంతో ఆ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని నూతన ప్రధాని నిర్ణయించినట్టు ‘టెలిగ్రాఫ్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. 

బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న రిషి సునాక్ అప్పట్లో మాట్లాడుతూ.. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే 2024-25 నాటికి విదేశీ ఆర్థిక సాయాన్ని 0.5 శాతం నుంచి 0.7 శాతానికి పెంచుతామన్నారు. అయితే, పరిస్థితులు మెరుగుపడకపోవడంతో ఈ సాయాన్ని మరో రెండేళ్లు అంటే 2026-27 వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు విదేశీ సాయాన్ని నిలిపివేయడం ఒక్కటే సరిపోదని, మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని టెలిగ్రాఫ్ పేర్కొంది. అందులో భాగంగా మరికొన్ని అంశాల్లోనూ కోతలు పడే అవకాశం ఉందని తెలిపింది.

More Telugu News