Wasim Akram: గతంలో నేను డ్రగ్స్ కు బానిసను: వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు

  • ఆత్మకథను తీసుకువస్తున్న అక్రమ్
  • కొకైన్ తీసుకునేవాడ్నని వెల్లడి
  • అది లేకుండా ఉండలేని స్థితికి వచ్చానని వివరణ
  • మొదటి భార్య మరణంతో మానేశానని స్పష్టీకరణ
Wasim Akram sensational revelations on his cocaine consumption

పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సంచలన విషయాలను బయటపెట్టాడు. గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని వెల్లడించాడు. ఓ దశలో కొకైన్ కు బానిసనయ్యానని తెలిపాడు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథలో అక్రమ్ ఈ సంగతులు పంచుకున్నాడు. 

టెలివిజన్ వ్యాఖ్యాతగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేశానని, ఆ సమయంలోనే మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డానని వివరించాడు. "దక్షిణాసియా దేశాల సంస్కృతిని పరిశీలిస్తే... ఒక్కసారి గొప్ప పేరు వచ్చిందంటే అది మిమ్మల్ని తినేస్తుంది, మైకంలో ముంచేస్తుంది, మిమ్మల్ని అవినీతిపరులుగానూ మార్చేస్తుంది. ఇక్కడ ఒక్క రాత్రిలో 10 పార్టీల్లో పాల్గొనేవాళ్లు ఉంటారు కూడా. ఈ సంస్కృతి నాపైనా తీవ్ర ప్రభావం చూపింది. 

కానీ నా భార్య హుమా అనారోగ్యంతో బాధపడుతూ చివరిక్షణాల్లో పడిన వేదన చూశాక నేను మళ్లీ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. తాను స్పృహలో లేకపోయినప్పటికీ నాలో మార్పు తీసుకువచ్చింది. అది మొదలు... నేను మరెప్పుడూ పతనం కాలేదు" అని అక్రమ్ తెలిపాడు. 

కాగా, డ్రగ్స్ అంశాన్ని తన మొదటి భార్య హుమాకు తెలియకుండా ఉంచాలని భావించానని వెల్లడించాడు. ఇంగ్లండ్ లో ఓ పార్టీలో పాల్గొన్న సందర్భంగా మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నానని, అక్కడ్నించి డ్రగ్స్ లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నానని వెల్లడించాడు. కొకైన్ తీసుకుంటేనే తాను పనిచేయగలనని భావించేవాడ్నని అక్రమ్ తెలిపాడు. 

ఆ సమయంలో హుమా ఒంటరిగా ఉండేదని తనకు తెలుసని వెల్లడించాడు. కామెంటరీ కోసం వెళుతున్నానని చెప్పి, పార్టీల్లో పాల్గొనేవాడ్నని, చాలా రోజుల పాటు ఇలాగే నటించానని వివరించాడు.

More Telugu News