Janasena: అరెస్టయిన జనసేన నేతలను ఘనంగా సన్మానించిన పవన్ కల్యాణ్

  • పీఏసీ సమావేశం కోసం మంగళగిరి వచ్చిన పవన్
  • ఇటీవలే అరెస్టై విడుదలైన నేతల ఫ్యామిలీలతో ఆత్మీయ సమావేశం
  • కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా
pawan kalyan honours janasena leaders who are arrested in vizag incident

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం మధ్యాహ్నానికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి హజరయ్యేందుకు విజయవాడ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విశాఖకు చెందిన నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవలే తన విశాఖ పర్యటనలో భాగంగా వైసీపీ మంత్రులు, నేతలపై దాడి చేశారన్న ఆరోపణలపై 9 మంది జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా... ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ అధిష్ఠానం నేతలకు బెయిల్ వచ్చేలా చేసింది.

శనివారం నాటి సమావేశానికి అరెస్టై విడుదలైన నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులను పార్టీ అధిష్ఠానం మంగళగిరి రప్పించింది. వారితోనే పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్టై విడుదలైన 9 మంది నేతలకు శాలువాలను కప్పి పవన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క నేతతో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్... అరెస్ట్ సందర్భంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

More Telugu News