Karnataka: కర్ణాటకలో మరో దుమారం.. సీఎంఓ నుంచి జర్నలిస్టులకు 'క్యాష్' గిఫ్టుల ఆరోపణలు!

Cash Gifts For Karnataka Journalists Latest In Congress PayCM Charge
  • దీపావళి స్వీట్ బాక్సులతో పాటు రూ. లక్ష నుంచి రెండున్నర లక్షల నగదు ఇచ్చారని ఓ వెబ్ సైట్ కథనం
  • సీఎంవో అధికారి నుంచి కొందరు జర్నలిస్టులకు ఈ గిఫ్టులు అందినట్టు కాంగ్రెస్ ఆరోపణ
  • ఈ ఆరోపణలు సత్యదూరం అంటూ కాంగ్రెస్ పై బీజేపీ ఎదురుదాడి
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరో దుమారం చెలరేగింది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి కొందరు జర్నలిస్టులకు స్వీట్ బాక్స్‌లతో పాటు లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు నగదు బహుమతులు ఇచ్చారనే ఆరోపణలు కలకలం సృష్టించాయి. అధికార బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ 'స్వీట్ బాక్స్ లంచం' పై న్యాయ విచారణ చేపట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

మరోవైపు బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ‘ది న్యూస్ మినిట్‌’ వెబ్ సైట్ కథనం ప్రకారం సీఎంవో నుంచి గిఫ్టు బాక్సులు అందుకున్న దాదాపు డజను మంది జర్నలిస్టులలో ముగ్గురు నగదు పంపిణీ చేసినట్లు ధ్రువీకరించారు. వారిలో ఇద్దరు దాన్ని తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇచ్చారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారంటూ సీఎం బసవరాజ్ బొమ్మై మీడియా సలహాదారుపై అవినీతి వ్యతిరేక కార్యకర్త ఒకరు కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎం కార్యాలయం నుంచి బహుమతి బాక్సు అందుకున్న ఓ జర్నలిస్ట్ దాన్ని తెరిచి చూడగా రూ. లక్ష నగదు ఉన్నట్లు గుర్తించి, విషయం తమ సంపాదకుడి దృష్టికి తీసుకెళ్లిట్టు చెప్పారని ‘ది న్యూస్ మినిట్‌’ పేర్కొన్నది. ఈ విషయం గురించి కర్ణాటక కాంగ్రెస్.. అధికార బీజేపీపై ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించింది. 

‘ప్రజా ధనాన్ని ఇలా లంచం ఇచ్చారా? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత లంచం ఇచ్చారు.. దీని ద్వారా తిరిగి ఏం ప్రయోజనం అందుకున్నారు? ముఖ్యమంత్రి బొమ్మైని ‘పేసీఎం’ అని మేం ఊరికే అనడం లేదు’ అని పేర్కొంది.  జైరామ్ రమేష్, రణదీప్ సింగ్ సూర్జేవాలా సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఆరోపణలు సత్యదూరం అంటూ కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడింది.
Karnataka
cmo
bribe
journalists
Congress
paycm

More Telugu News