IndiGo: టేకాఫ్ అవుతుండగా ఇండిగో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో

IndiGo planes engine catches fire during takeoff at Delhi airport
  • ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైన విమానం
  • టేకాఫ్‌కు ఐదారు సెకన్ల ముందు ఇంజిన్‌లో మంటలు
  • అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసిన పైలట్
  • ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 184 మంది
విమాన ప్రమాదాలకు సంబంధించి ఇటీవల తరచూ వార్తలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఇండిగో విమానాలు తరచూ ప్రమాదాల బారినపడుతున్నాయి. తాజాగా, ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఘటన విమానంలోని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీలో గత రాత్రి జరిగిందీ ఘటన. 

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు టేకాఫ్ అయేందుకు సిద్ధమైన ఇండిగో విమానంలోని ఓ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే నిలిపివేశాడు. ఘటన జరిగిన సమయంలో సిబ్బందితో కలిసి మొత్తం 184 మంది ఉన్నారు. సరిగ్గా రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా 11 గంటల తర్వాత ప్రయాణికులు బయటకు వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వారిని వేరే విమానంలో బెంగళూరుకు పంపారు. విమానం టేకాఫ్ కావడానికి ఐదు సెకన్ల ముందు మంటలు అంటుకున్నాయి. పైలట్ విమానాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇంజిన్‌లో లోపం తలెత్తిందని పైలట్ తమకు చెప్పినట్టు ఓ ప్రయాణికుడు తెలిపాడు. విమానం మరో ఐదు నుంచి ఏడు సెకన్లలో టేకాఫ్ కావాల్సి ఉందని, అప్పుడు తాను విమానం రెక్కల వద్ద మంటలు రావడాన్ని గమనించానని ఆ ప్రయాణికుడు పేర్కొన్నారు. ఆ మంటలు క్షణాల్లోనే పెద్దవి అయ్యాయన్నారు. ఆ తర్వాత విమానం ఆగిపోయిందన్నారు. ఆ సమయంలో విమానం లోపల తీవ్ర గందరగోళం నెలకొందని అయితే, ఏం కాదని సిబ్బంది తమకు హామీ ఇచ్చారని వివరించారు. మరో విమానంలో తమను తరలిస్తామని చెప్పారన్నారు. 

ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని నిలిపివేసినట్టు పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికులను వేరే విమానంలో గమ్యస్థానాలకు పంపిస్తామని పేర్కొంది. ఈ ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
IndiGo
IndiGo Plane Fire
Delhi Airport
Bengaluru

More Telugu News