Tammineni Sitaram: మరుగుజ్జు మనస్తత్వం ఉన్నవారే శ్రీకాకుళాన్ని రాజధానిగా కోరుకుంటారు: స్పీకర్ తమ్మినేని

  • రాజధాని విషయంలో చంద్రబాబు లాజిక్ మిస్సయ్యారన్న తమ్మినేని
  • అమరావతిలో ఉన్నవన్నీ ఆవ భూములేనన్న స్పీకర్
  • జడ్పీ సమావేశంలో విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం
  • విశాఖ రాజధాని కోసం అవసరమైతే ఉద్యమం చేస్తామన్న తమ్మినేని
Tammineni Sitaram slams TDP Chief Chandrababu

మరుగుజ్జు మనస్తత్వం ఉన్నవారే శ్రీకాకుళాన్ని రాజధానిగా కోరుకుంటారని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నిన్న శ్రీకాకుళంలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. అమరావతిలో ఉన్నవన్నీ ఆవ భూములని, రాజధాని కట్టేందుకు అవి పనికిరావని అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు లాజిక్ మిస్సయ్యారని, అతి తెలివితో తప్పటడుగు వేశారని అన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్ర పన్నారని తమ్మినేని ఆరోపించారు.

ఈ సమావేశంలో టీడీపీ జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు మాట్లాడుతూ.. శ్రీకాకుళాన్ని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తమ్మినేని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రాజధాని కావాలనే వారిది మరుగుజ్జు మనస్తత్వమని అన్నారు. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా టీడీపీ తీర్మానం చేయగలదా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ అని, విశాఖ రాజధాని సాధనకు అవసరమైతే మరోమారు ఉద్యమాల ఖిల్లాగా మారుతుందని అన్నారు.

అమరావతి రైతుల పాదయాత్రను సూర్యభగవానుడు కూడా హర్షించలేదని, అందుకే వారిని వెనక్కి పంపారని తమ్మినేని అన్నారు. రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుతమైన రాజధానిగా మారుతుందన్న ఆయన, ఈ విషయంలో న్యాయం చేయాలని న్యాయమూర్తులకు చేతులెత్తి మొక్కుతున్నట్టు చెప్పారు. కాగా, ఈ సమావేశంలో విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని హైకోర్టుకు పంపిస్తామని స్పీకర్ తమ్మినేని తెలిపారు.

More Telugu News