Imran Khan: పాకిస్థానీలు బానిసలు... భారత్ భేష్: ఇమ్రాన్ ఖాన్

  • భారత విదేశాంగ విధానంపై ఇమ్రాన్ మరోసారి ప్రశంసలు
  • రష్యా నుంచి ధైర్యంగా చమురు కొనుగోలు చేస్తోందని వెల్లడి
  • కానీ పాకిస్థానీలకు బయటి నుంచి అనుమతి రావడంలేదని విమర్శలు
  • దేశం కోసం నిర్ణయాలు దేశం లోపలే తీసుకోవాలని స్పష్టీకరణ
Imran Khan once again praises India

పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఇమ్రాన్ ఖాన్ భారత్ పై తరచుగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి భారత్ పై ప్రశంస పూర్వక వ్యాఖ్యలు చేశారు. భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనియాడారు. దేశ ప్రజల కోసం రష్యా నుంచి ధైర్యంగా చమురును కొనుగోలు చేస్తోందని అన్నారు. దేశ ప్రజల కోసం ఎవరికీ తలొగ్గడంలేదని తెలిపారు. 

కానీ పాకిస్థానీలు బానిసలుగా మారిపోయారని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి వారికి అనుమతి లభించడంలేదని విమర్శించారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు దేశం లోపలే తీసుకోవాలని పరోక్షంగా పాక్ పై అగ్రదేశాల పెత్తనం ఎక్కువైందన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చారు. తానే గనుక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉంటే ఎవరితో సంబంధం లేకుండా, రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తానని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు. 

పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ తో ఇమ్రాన్ ఖాన్ నేడు ఇస్లామాబాద్ లో లాంగ్ మార్చ్ ప్రారంభించారు. ఇప్పటికే సమస్యల వలయంలో సతమతమవుతున్న పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.

More Telugu News