Ravichandran Ashwin: నవాజ్ విసిరిన ఆ బంతి టర్న్ అయ్యుంటే... నేనీపాటికి రిటైర్ అయ్యుండేవాడ్ని: అశ్విన్ చమత్కారం

  • ఉత్కంఠ పోరులో పాక్ ను ఓడించిన భారత్
  • విన్నింగ్ షాట్ కొట్టిన అశ్విన్
  • తాను అవుటై ఉంటే పరిస్థితి ఏంటో వివరించిన అశ్విన్
  • బీసీసీఐ టీవీతో సరదా వ్యాఖ్యలు
Ashwin opines if Nawaz delivery turned and hit pads

టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ షాట్ కొట్టడంతో టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. అంతకుముందు బంతిని అశ్విన్ వదిలేయడంతో అది వైడ్ అయింది. దాంతో భారత్ కు ఓ కీలక పరుగు లభించింది. 

తాను వదిలేసిన ఆ బంతి మలుపు తిరిగి ప్యాడ్లకు తగిలి ఉంటే ఏం జరిగుండేదో అశ్విన్ బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ వివరించాడు. 'నవాజ్ వేసిన బంతి టర్న్ అయి, ప్యాడ్లకు తగిలుంటే అవుటయ్యేవాడ్ని... అప్పుడు ఇంకేం చేస్తాను, వెంటనే రిటైర్మెంట్ ప్రకటించేవాడ్ని' అంటూ చమత్కరించాడు.

"ఆ బంతికి అవుటయ్యుంటే, హడావుడిగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోయేవాడ్ని. ఫోన్ తీసుకుని ట్విట్టర్ ఓపెన్ చేసి, 'నా క్రికెట్ కెరీర్ లో అన్ని వేళలా మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ప్రయాణం అని భావిస్తాను' అంటూ రిటైర్మెంట్ సందేశాన్ని వెలువరించేవాడ్ని" అని అశ్విన్ నవ్వులు పూయించాడు. 

కాగా, ఆ మ్యాచ్ లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్, పాండ్యా కీలక బ్యాటింగ్ తో భారత్ విజయం సాధించినా, విన్నింగ్ షాట్ కొట్టిన ఘనతను అశ్విన్ దక్కించుకోవడం విశేషం. చివరి ఓవర్లో బరిలోకి వచ్చిన అశ్విన్... ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.

More Telugu News