Menopause: మెనోపాజ్ దశలో మహిళల శరీరాల్లో ఎన్నో మార్పులు!

  • మెనోపాజ్ తో నిలిచిపోనున్న ఈస్ట్రోజెన్ ఉత్పత్తి
  • ఆరోగ్యాన్ని కాపాడడంతో ఈ హార్మోన్ పాత్ర ఎంతో
  • బరువు తగ్గించుకుని, పోషకాహారం తీసుకోవడం అవసరం
Menopause How to prepare your body for it

మహిళల జీవితంలో మెనోపాజ్ దశ చాలా కీలమైనది. మెనోపాజ్ అంటే రుతుక్రమం (నెలసరి) ఆగిపోవడం. దీన్నే పునరుత్పాదక వ్యవస్థ నిలిచిపోవడం అని కూడా చెబుతారు. ఒవేరియన్ యాక్టివిటీ.. అంటే అండాలు విడుదల కావడం నిలిచిపోతుంది. సహజ జీవన చక్రంలో భాగం ఇది. దీని తర్వాత మహిళలు పిల్లల్ని కనలేరు.

మహిళల్లో 45-55 ఏళ్ల మధ్య మెనోపాజ్ వస్తుంది. సగటు వయసు 50 ఏళ్లుగా చెప్పుకోవచ్చు. చాలా కొద్ది మందిలో ఇది 40 ఏళ్లలోనూ కనిపిస్తుంది. మెనోపాజ్ ఆరంభంలో నెలసరి క్రమంలో వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే ప్రతి నెలా కచ్చితంగా ఇన్ని రోజులకు ఒకసారి వచ్చే రుతుక్రమం గాడి తప్పుతుంది. నెలసరి కాస్తా నెలన్నర, రెండు నెలలు, మూడు నెలలు అలా మారిపోతుంది. తక్కువ రక్తస్రావం అవుతుంది. రాత్రి సమయాలలో చెమటలు పడుతుంటాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం కనిపిస్తుంది. మూడ్ లో (స్వభావం) మార్పులు వస్తాయి. లైంగిక కోర్కెలు తగ్గిపోతాయి. యూరినరీ బ్లాడర్ సమస్యలు కనిపిస్తాయి. బరువు పెరుగుతారు. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఈ లక్షణాలు అన్నీ కనిపించాలనేమీ లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో మాదిరిగా ఉండొచ్చు. 

ఈస్ట్రోజెన్ కీలకం..

  • నెలసరి క్రమంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంటుంది. ఇది అతి ముఖ్యమైన ఒవేరియన్ హార్మోన్. ఇది కేవలం పునరుత్పత్తి కోసమే కాకుండా.. మహిళల ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. 
  • ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి ఇది ఎంతో సాయపడుతుంది. మెనోపాజ్ తో ఈ హార్మోన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫలితంగా ఎముకలు గుల్లబారిపోతాయి. దీంతో తరచూ ఫ్రాక్చర్ల బారిన పడుతుంటారు. 
  • మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్ పెరగడానికి ఈస్ట్రోజన్ సాయం చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గించేస్తుంది. దీంతో  గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈస్ట్రోజన్ పాత్ర చాలానే ఉంటుంది.
  • ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా ఉంచడంలో ఈస్ట్రోజన్ కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకే మెనోపాజ్ మహిళలకు టైప్ 2 మధుమేహం రిస్క్ ఎక్కువ. బరువు పెరగడం వల్ల మధుమేహం, గుండె జబ్బుల రిస్క్ అధికమవుతుంది.
  • మెదడులో నరాల పనితీరు సాధారణంగా, చురుగ్గా ఉంచడంలో ఈస్ట్రోజన్ పాత్ర ఉంటుంది. 

మెనోపాజ్.. రెడీ
  • మెనోపాజ్ అన్నది ఎవరికైనా తప్పదు. కాకపోతే మెనోపాజ్ తర్వాత కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ప్రతికూలతల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం శరీర బరువు పరిమితి దాటకుండా చూసుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ దశలో మహిళల్లో ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ రిస్క్ పెరుగుతుంది. కనుక తక్కువ బరువు ఎంతో సాయపడుతుంది.
  • రోజువారీ వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శరీర జీవక్రియలు చురుగ్గా మారతాయి. 
  • అన్ని పోషకాలు లభించేలా ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్లు, ఫైబర్ ఉండే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కార్బోహైడ్రేట్లను తగ్గించి తీసుకోవాలి. పండ్లు, కూరగాయల పరిమాణాన్ని పెంచాలి. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటే ఆరోగ్యానికి మంచిది.
  • రోజువారీ అవసరమైన మేరకు క్యాల్షియం, విటమిన్ డీ లభించేలా చూసుకోవాలి. నువ్వులు, రాగులు, అరటి పండు తదితర వాటి ద్వారా క్యాల్షియం అందుతుంది. సూర్యోదయం సమయంలో కిరణాలు అరగంట పాటు శరీరానికి తగిలేలా చూసుకుంటే విటమిన్ డీ సరిపడా లభిస్తుంది. కెఫైన్ ను తగ్గించాలి.
  • మెడిటేషన్, ప్రాణాయం, ధ్యానం, యోగాసనాలు ఎంతో సాయపడతాయి.

More Telugu News