Girls: రాజస్థాన్ లో దారుణాలు.. బాలికలు, గృహిణుల అమ్మకం

Girls sold women raped to settle disputes in Rajasthan report
  • కుల పంచాయతీ పెద్దల దుర్మార్గమైన తీర్పులు
  • బాలికలు, గృహిణులపై అత్యాచారాలు
  • విదేశాలకు రవాణా
  • సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్
రాజస్థాన్ లోని గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న అప్పు చెల్లించకపోతే.. కుటుంబంలోని బాలికలు, గృహిణులను అమ్ముకోవాల్సిన దారుణ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. అప్పు తీర్చకపోతే బాలికలను అమ్మాలని, గృహిణులను రేప్ చేయాలని కుల పంచాయతీ పెద్దలు జారీ చేస్తున్న దారుణ తీర్పుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 

హిందీ జాతీయ పత్రిక దైనిక్ భాస్కర్ ఇందుకు సంబంధించి ఓ కథనాన్ని బయటపెట్టింది. దీని ప్రకారం.. భిల్వారా తదితర ప్రాంతాల్లోని కొన్ని కులాల ప్రజలు వివాదాల పరిష్కారానికి పోలీసుల వరకు వెళ్లడం లేదు. కుల మండళ్లను ఆశ్రయిస్తున్నారు. ఒక కేసులో రూ.15 లక్షల రుణం చెల్లించనందుకు సోదరిని విక్రయించాలంటూ కుల పెద్దలు ఆదేశించారు. ఆ తర్వాత అతడి 12 ఏళ్ల బాలికను కూడా వేలం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

బాలికలను విక్రయించాలని లేదంటే వారి తల్లులపై అత్యాచారం చేయాలనే తీర్పులను కూడా వారు జారీ చేస్తున్నట్టు సదరు కథనం పేర్కొంది. ఓ బాలికను రూ.6 లక్షలకు విక్రయించగా, కొనుగోలుదారులు ఆమెను ఆగ్రా తీసుకెళ్లారు. ఆ తర్వాత మూడు విడతలుగా ఆమె విక్రయానికి గురైంది. అలా నాలుగు సార్లు గర్భం దాల్చింది. తన భార్య చికిత్స కోసం రూ.6 లక్షలు తీసుకుని చెల్లించనందుకు కూతుర్ని ఆ తండ్రి అమ్ముకునేలా కులపెద్దలు తీర్పు ఇవ్వడం అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. కొనుగోలు చేసిన బాలికలను విదేశాలకూ రవాణా చేస్తున్నట్టు వెలుగు చూసింది.

దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ నాలుగు వారాల్లోగా చర్యల నివేదికను తమకు సమర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
Girls
sold
women
raped
Rajasthan
caste councels
mandates

More Telugu News