Team India: పసికూనపై సునాయాసంగా గెలిచిన టీమిండియా

team india beats Netherlands in t20 world cup
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
  • నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసిన టీమిండియా
  • వరుసగా రెండో మ్యాచ్ లోనూ టాప్ స్కోరర్ గా నిలిచిన కోహ్లీ
  • బౌండరీలతో వీరవిహారం చేసిన సూర్యకుమార్ యాదవ్
  • 20 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే చేసిన నెదర్లాండ్స్
  • భారత్ చేతిలో 56 పరుగుల తేడాతో ఓడిపోయిన పసికూన
టీ20 వరల్డ్ కప్ లో భారత క్రికెట్ జట్టు గురువారం రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీని సాధించిన టీమిండియా.... గురువారం క్రికెట్ లో పసికూన నెదర్లాండ్స్ ను అలవోకగా ఓడించేసింది. టాస్ గెలిచిన టీమిండియా సంప్రదాయానికి భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) పరుగులకే అవుట్ అయినా... మరో ఎండ్ లోని ఓపెనర్ రోహత్ శర్మ (53) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో చెలరేగాడు. 

ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ (62) మరోమారు జూలు విదిల్చాడు. తాను ఇక ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్లేనన్న సంకేతాలు ఇచ్చాడు. పాక్ తో మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన కోహ్లీ నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కూడా టాప్ స్కోరర్ గానే నిలిచాడు. 44 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ... 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 62 పరుగులు సాధించాడు. పాక్ తో మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ (51)... ఈనాటి మ్యాచ్ లో సత్తా చాటాడు. కేవలం 25 బంతుల్లోనే 7 ఫోర్లు, ఓ సిక్స్ తో యాదవ్ చెలరేగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ 179 పరుగులు చేసింది.

180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు కనీస పోరు కూడా ఇవ్వలేకపోయింది. భారత బౌలర్లు సంధించిన పదునైన బంతులను ఎదుర్కొనేందుకు నెదర్లాండ్స్ బ్యాటర్లు నానా పాట్లు పడ్డారు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో టాప్ స్కోరర్ గా నిలిచిన టిమ్ ప్రింగిల్ కేవలం 20 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే బ్యాటర్లతో ఆ జట్టు తన ఇన్నింగ్స్ లో ఏ కోశాన ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయితే నిర్ణీత 20 ఓవర్ల పాటు ఆడిన నెదర్లాండ్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసింది. వెరసి భారత జట్టు చేతిలో 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
Team India
Virat Kohli
Rohit Sharma
T20 World Cup
Australia
Netherlands

More Telugu News