Team India: కోహ్లీ క్లాస్, సూర్యకుమార్ మాస్, రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... భారీ స్కోరు సాధించిన టీమిండియా

  • టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ తో భారత్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 రన్స్
  • కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ అర్ధ సెంచరీలు
Team India posts huge total against Nederlands

పరుగుల దాహంతో ఉన్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో మరోసారి విజృంభించాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో తన క్లాస్ బ్యాటింగ్ ను ప్రదర్శిస్తూ అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ 44 బంతుల్లోనే 62 పరుగులు చేయడం విశేషం. కోహ్లీ స్కోరులో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. 

అతడికి సూర్యకుమార్ యాదవ్ మాస్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స్ తో 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 పరుగులు చేసింది. 

అంతకుముందు, టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. రోహిత్ స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్ 1, ఫ్రెడ్ క్లాసెన్ 1 వికెట్ తీశారు. 

నెదర్లాండ్స్ చిన్న జట్టే అయినా, తొలి పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ కు కళ్లెం వేసింది. అయితే మరిన్ని వికెట్లు తీయడంలో విఫలమైంది. తొలుత రోహిత్ తో కీలక భాగస్వామ్యం నమోదు చేసిన కోహ్లీ... ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో అజేయ భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను భారీ స్కోరు దిశగా నడిపించాడు.

More Telugu News