Telangana: మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో దొరికిన డబ్బెంత?...ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?: కిషన్ రెడ్డి

  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్న కిషన్ రెడ్డి
  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరేనని ఆరోపణ
  • మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే కొత్త నాటకమని విమర్శ
  • ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాకర్షణ కలిగిన నేతలా అని ప్రశ్న
union minister kishan reddy fores over operation akarsh deal which busted yester day

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై... టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ ఘటనపై గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో పోలీసులు పెద్ద మొత్తంలో సీజ్ చేశారని చెబుతున్న డబ్బు ఎంత?.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ డబ్బును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకువచ్చారా?.. లేదంటే కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు.

అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని కూడా కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవిస్తూ... ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా బీజేపీలోకి వస్తామంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయించి మరీ పార్టీలోకి చేర్చుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి లాగిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ రాజీనామా చేయించారా? అని ఆయన ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందన్న భయంతోనే కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సరిగ్గా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమైందని సర్వేలు తేల్చిచెప్పగా పోలింగ్ కు ముందు రోజు రఘునందన్ రావు ఇంటిపై ఎలా దాడి చేశారో... ఇప్పుడు మునుగోడు ఎన్నికలో ఓటమి భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. అసలు బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించిందన్న నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాకర్షణ కలిగిన నేతలా? అని ఆయన ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ దాడులంటూ సానుభూతి పొందేందుకు చేసిన యత్నం విఫలం కావడంతో డీల్ డ్రామాకు కేసీఆర్ రూపకల్పన చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

More Telugu News