Jagan: మళ్లీ మనదే అధికారం: ముఖ్యమంత్రి జగన్

  • రాష్ట్రంలో క్లీన్ స్వీప్ సాధ్యమేనని వ్యాఖ్య
  • రాబోయే 30 ఏళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉంటుందని ధీమా
  • మూడున్నరేళ్లుగా చేస్తున్న మంచి పనులను చెప్పడానికే గడపగడపకూ ప్రభుత్వం
  • ప్రజల్లోకి వెళ్లి మనం చేసిన మంచి పనులు చెప్పాలని కార్యకర్తలకు సూచన
CM Jagan said that it will not be difficult to clean sweep 175 assembly constituencies

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అవినీతిరహితంగా పాలిస్తున్నందుకు ప్రజలు మరోమారు తమకే పట్టం కడతారని చెప్పారు. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోందని వివరించారు. మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్ సూచించారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని, వాళ్ల ఆశీర్వాద బలంతో వచ్చే 30 ఏళ్లు రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. 

ప్రభుత్వ పనితీరు ఇప్పుడు అంతటా కనిపిస్తోందని, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లతో పల్లెల వాతావరణమే మారిపోయిందని జగన్ వివరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించి చెప్పేందుకే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 

ఇప్పటి నుంచే ఎన్నికల గురించి ఆలోచనలు చేయాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్ సూచించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలునిచ్చారు. ఎన్నికలకు ఇంకా 18 నెలలు ఉందని అశ్రద్ధ చేయొద్దని హెచ్చరించారు. ఈరోజు నుంచే సరిగ్గా పని చేసుకుంటూ పోతే రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయగలమని చెప్పారు. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశామని తెలిపారు. అర్హులెవరూ మిస్‌ కాకుండా వాలంటీర్లు, సచివాలయం ద్వారా ఇంటింటికీ పథకాలను చేర్చామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ 87 శాతం ఇళ్లకు మంచి చేశామని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ను ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

టిడ్కో ఇళ్లకు సంబంధించిన ఫేజ్-1 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని గృహనిర్మాణ శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని, లేదంటే అవి మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు. కాగా, డిసెంబరు నాటికి 1.10 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

More Telugu News