అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి: రాజేంద్ర ప్రసాద్

  • రాజేంద్రప్రసాద్ ప్రధానమైన పాత్రలో నటించిన 'అనుకోని ప్రయాణం'
  • ఈ నెల 28వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఇది తన కెరియర్లో మరో గొప్ప సినిమా అంటూ చెప్పిన నటకిరీటి
Anukoni Prayanam Pre Release Event

కొవిడ్ నేపథ్యంలో ఆ మధ్య ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. అదే నేపథ్యంలో ఎమోషన్ ను ప్రధానంగా చేసుకుని రూపొందిన సినిమానే 'అనుకోని ప్రయాణం'. రాజేంద్ర ప్రసాద్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, నరసింహారాజు .. ప్రేమ .. తులసి ముఖ్యమైన పాత్రలను పోషించారు. జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమాకి, వెంకటేశ్ పెదరెడ్ల దర్శకత్వం వహించాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును వైజాగ్ లో నిర్వహించారు. ఈ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. "వైజాగ్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది. కొత్తవాళ్లు వస్తే కొత్త కథలు వస్తాయని నమ్మేవాడిని నేను. అందువల్లనే కొత్తవాళ్లతో ఈ సినిమాను చేశాను. ఈ సినిమాను నేను ఒప్పుకోవడం ఏదో గొప్ప విషయమన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంత మంచి కథ ఎవరికి వెళ్లిపోతుందోనని వెంటనే ఓకే చెప్పేశాను .. అసలు కారణం అది.

నేను చేసిన చెప్పుకోదగిన సినిమాలలో 'అనుకోని ప్రయాణం' ఒకటి. ఈ కథలో కామెడీ కూడా ఉంది. ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది. 'ఆ నలుగురు' తరువాత ఆ తరహాలో నేను చేసిన సినిమా ఇది. నేను ఎప్పటికీ మరిచిపోలేని సినిమా ఇది. అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అద్భుతమే ఈ సినిమా. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

ఇక నరసింహారాజు మాట్లాడుతూ .. "నేను చిరంజీవిగారితోను .. రాజేంద్రప్రసాద్ గారితోను కలిసి పనిచేశాను. ఇద్దరిలో నేను గమనించింది కృషి - పట్టుదల. వారి అంకిత భావమే వారిని ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా కోసం నన్ను సిఫార్సు చేసింది రాజేంద్ర ప్రసాద్ గారే. అందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని అన్నారు. ప్రేమ మాట్లాడుతూ .. "రాజేంద్ర ప్రసాద్ గారితో ఫస్టు టైమ్ నటించాను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా తప్పకుండా  పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News