YSRCP: అచ్చెన్న నియోజకవర్గంపై జగన్ సమీక్ష... హాజరైన దువ్వాడ శ్రీనివాస్, కిల్లి కృపారాణి

  • నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలతో భేటీ అవుతున్న జగన్
  • చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై ఇదివరకే సమీక్ష
  • టెక్కలిలో వైసీపీ జెండా ఎగురవేయాలని నేతలకు పిలుపు
ysrcp chief ys jagan review meeting on tekkali constituency

టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై కూడా సమీక్ష చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా బుధవారం జరిగిన టెక్కలి నియోజకవర్గ సమీక్షకు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, పేరాడ తిలక్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని జగన్ ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన చర్యలను నేటి నుంచే ప్రారంభించాలని కూడా సూచించారు. 

నియోజకవర్గంలో కొనసాగుతున్న 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం తీరుపైనా జగన్ ఆరా తీశారు. టెక్కలికి గడచిన మూడున్నరేళ్లలో వివిధ పథకాల కింద రూ.1,026 కోట్లను మంజూరు చేసినట్లు జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

More Telugu News