T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం.. ఇంగ్లండ్ కు ఐర్లాండ్ షాక్

  • ఇంగ్లండ్ కొంపముంచిన వర్షం 
  • డక్ వర్త్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో గెలిచిన ఐరిష్ టీమ్
  • బల్బిర్నీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
  • 2011 తర్వాత వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై ఐర్లాండ్ గెలుపు 
Ireland beat England by 5 runs at the MCG

టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కు పసికూన ఐర్లాండ్ షాకిచ్చింది. బుధవారం జరిగిన సూపర్-12 రౌండ్ గ్రూప్–1 మ్యాచ్ లో ఐర్లాండ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 స్కోరుకు ఆలౌటైంది. కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. కీపర్ లోక్రాన్ టకర్ (34) కూడా రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, లియమ్ లివింగ్ స్టోన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్ రెండు వికెట్లు తీశారు. 

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో 105/5 స్కోరుతో నిలిచిన సమయంలో వర్షంతో ఆట ఆగిపోయింది. అప్పటికి డక్ వర్త్ పద్ధతిలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని 110 పరుగులుగా లెక్కగట్టారు. దాంతో, ఇంగ్లండ్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. 

కెప్టెన్ బట్లర్ (0), అలెక్స్ హేల్స్ (7), బెన్ స్టోక్స్ (6) విఫలమైనా డేవిడ్ మలన్ (35), మొయిన్ అలీ (24 నాటౌట్) రాణించారు. చేతిలో ఐదు వికెట్లు ఉన్నప్పటికీ వర్షం ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బతీసింది. 

ఐర్లాండ్ బౌలర్లలో జోష్ లిటిల్ రెండు వికెట్లు పడగొట్టాడు. బల్బిర్నీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ ను ఐర్లాండ్ ఓడించడం ఇది రెండోసారి. గతంలో 2011 వన్డే ప్రపంచ కప్ లో తొలిసారి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ టీమ్ ను దెబ్బకొట్టింది.

More Telugu News