T20 World Cup: ఐసీసీ ఇచ్చిన ఆహారంపై భారత ఆటగాళ్ల అసంతృప్తి

  • ప్రాక్టీస్ తర్వాత అన్ని దేశాలకు ఒకే ఆహారం ఇస్తున్న ఐసీసీ
  • పండ్లు, చల్లటి శాండ్‌విచ్‌లు వద్దన్న ఆటగాళ్లు
  • హోటల్ కి వెళ్లి భోజనం చేసిన టీమిండియా ప్లేయర్లు
India cricketers unhappy with after practice meal in Sydney

టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆహారం విషయంలో ఇబ్బంది పడుతోంది. నెదర్లాండ్స్ తో మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న రోహిత్ సేన.. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నది. అయితే, ప్రాక్టీస్ సమయంలో అందించిన ఆహారం బాగా లేకపోవడంతో కొందరు క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో, కొంత మంది తమ హోటల్ గదులకు తిరిగి వెళ్లి ఆహారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అన్ని జట్లకు ప్రాక్టీస్ తర్వాత దాదాపు ఒకే రకమైన ఫుడ్ ఇస్తున్నారు. అయితే భారత ఆటగాళ్లకు వేడి ఆహారాన్ని అందించడం లేదు. తీవ్రమైన శిక్షణ తర్వాత ఆటగాళ్లు వేడి వేడి ఆహారాన్నే తీసుకుంటారు. దాంతో, చల్లటి ఆహార పదార్థాలను తిప్పి పంపించి, తమకు నచ్చిన ఫుడ్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. 


కాగా, భారత జట్టు మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ప్రాక్టీస్ తర్వాత ఆహారంలో పండ్లు మరియు ఫలాఫెల్ తో పాటు కస్టమ్ శాండ్‌విచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు శిక్షణ జరగడం, అది లంచ్ సమయం కూడా కావడంతో ఆటగాళ్ళు.. నిర్వాహకులు పంపించిన ఫుడ్ వద్దని మధ్యాహ్న భోజనం ఆశించారు. 

‘ఇది ఐసీసీ పంపించిన ఆహారాన్ని బహిష్కరించినట్టు కాదు. కొంతమంది ఆటగాళ్ళు పండ్లు, ఫలాఫెల్ తీసుకున్నారు. అయినా ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని కోరుకున్నారు. అందుకే హోటల్ కి వెళ్లి భోజనం చేశారు. ఇక్కడ సమస్య ఏమిటంటే లంచ్ సమయంలో ఐసీసీ వేడి ఆహారాన్ని అందించకపోవడం. ద్వైపాక్షిక సిరీస్‌లోఆతిథ్య దేశం క్యాటరింగ్ బాధ్యతలు నిర్వహిస్తుంది. వాళ్లు ఎల్లప్పుడూ శిక్షణ తర్వాత వేడి వేడి భారతీయ భోజనాన్ని అందిస్తారు. కానీ ఐసీసీ నియమం అన్ని దేశాలకు ఒకేలా ఉంటుంది. రెండు గంటల శిక్షణ తర్వాత మీకు అవోకాడో, టొమాటో, దోసకాయలతో కూడిన చల్లని శాండ్‌విచ్ (గ్రిల్ కూడా చేయలేరు) తినలేరు కదా. పైగా, అది సాదాసీదా ఫుడ్’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. దీని తర్వాత బీసీసీఐ రంగంలోకి దిగి రాబోయే శిక్షణా సెషన్‌లకు వేడి వేడి భారత భోజనాన్ని ఏర్పాటు చేస్తుందేమో చూడాలి.

More Telugu News