Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్లు.. సీరియస్ అయిన పూరి.. ఆడియో లీక్

  • డిజాస్టర్ గా నిలిచిపోయిన 'లైగర్'
  • డబ్బులు ఇవ్వాలంటూ పూరి జగన్నాథ్ పై బయ్యర్ల ఒత్తిడి
  • ధర్నా చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం
Buyers blackmailing Puri Jagannadh

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఎంతో మందిని స్టార్లను చేసిన ఘనత ఆయనది. టాలీవుడ్ లో తొలి సారి రూ. 100 కోట్లను కొల్లగొట్టిన పూరీ తీసిన సినిమానే (పోకిరి). అలాంటి క్రియేటర్ కు కొంత కాలంగా టైమ్ బాగోలేదు. 'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ గాడిన పడ్డాడని అందరూ భావిస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమాను తీశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ... చివరకు ఆ చిత్రం ఒక డిజాస్టర్ గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంపాలయింది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ తో పాటు బయ్యర్లు కూడా కోట్లలో నష్టపోయారు. 

మరోవైపు, సినిమా నష్టాలను మిగల్చడంతో తమ పరిస్థితి ఏమిటని పూరి జగన్నాథ్ ను బయ్యర్లు అడగడం మొదలు పెట్టారు. దీంతో, కొన్ని రోజులు ఓపిక పడితే ఎంతో కొంత అడ్జెస్ట్ చేస్తానని వారికి పూరి చెప్పారు. అయితే, పూరి నుంచి డబ్బులు అందకపోవడంతో... ధర్నా చేస్తామంటూ ఆయనను బ్లాక్ చేయడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించి బయ్యర్లు, పూరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో లీక్ అయింది. 

ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటూ బయ్యర్లను పూరి ప్రశ్నించారు. తాను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. ఒక నెలలో డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ.. అతి చేస్తే... డబ్బులు ఇవ్వాలనిపించదని అన్నారు. సినిమా అంటేనే గ్యాంబ్లింగ్ అని, ఒకసారి సినిమా హిట్ అయితే, మరోసారి ఫ్లాప్ అవుతుందని చెప్పారు. ఒకసారి సినిమా హిట్ అయితే బయ్యర్ల నుంచి డబ్బులు తీసుకోవడానికి తాము ఎంతో తిరగాలని అన్నారు. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్ల నుంచి తనకు రావాల్సిన డబ్బు చాలా ఉందని చెప్పారు. ఆ డబ్బును తనకు బయ్యర్స్ అసోసియేషన్ వసూలు చేసి పెడుతుందా? అని ప్రశ్నించారు. ధర్నా చేసేవాళ్ల లిస్ట్ తీసుకుంటానని... వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, మిగతా వాళ్లకే ఇస్తానని చెప్పారు. పూరి మాట్లాడిన ఈ ఆడియో సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలపై సినిమా పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News