USA: అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి విందు

  • తనకు గర్వకారణమన్న అధ్యక్షుడు బైడెన్
  • వైట్ హౌస్ లో ఇప్పటి వరకు ఇవే అతిపెద్ద దీపావళి వేడుకలని వ్యాఖ్య
  • అమెరికా సంస్కృతిలో దీపావళికి చోటుకల్పించారంటూ భారతసంతతికి బైడెన్ అభినందనలు
  • ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా పెద్ద సంఖ్యలో భారత సంతతి నేతలు, అధికారుల హాజరు
US President Joe Biden hosts largest Diwali reception at White House

అమెరికాలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వాళ్లతో పాటు పలువురు అమెరికన్లు కూడా ఈ దీపాల పండుగను ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. బాణసంచా పేలుస్తూ, స్వీట్లు పంచుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగకు ముందు అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ తన ఇంట్లో దీపావళి విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఇండియాలో తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయని వ్యాఖ్యానించారు. 

ఇక, పండగ నాడే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సతీమణి జిల్ బైడెన్ తో కలిసి వైట్ హౌస్ లో దీపావళి విందు ఏర్పాటు చేశారు. భారత సంతతికి చెందిన పలువురు అధికారులు, వ్యాపారస్తులు తదితరులను ఆహ్వానించారు. దీపావళి సందర్భంగా ఇప్పటి వరకు అధ్యక్ష భవనంలో జరిగిన అధికారిక వేడుకల్లో ఇవే అతిపెద్ద వేడుకలంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. తర్వాత బైడెన్ మాట్లాడుతూ.. అమెరికా సంస్కృతిలో దీపావళిని చేర్చినందుకు భారత సంతతికి, దేశంలో ఉన్న భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. దీపావళి సందర్భంగా విందు ఇవ్వడం తనకు గర్వకారణమని బైడెన్ చెప్పారు.

ఈ విందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో పాటు భారత సంతతికి చెందిన అధికారులు, వ్యాపారస్తులు సుమారు 200 మంది తమ కుటుంబాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష భవనంలో ప్రతీ అమెరికన్ తన సంప్రదాయాలను, తమకంటూ ప్రత్యేకమైన వేడుకలను నిర్వహించుకునే సత్సంప్రదాయాన్ని బైడెన్ దంపతులు నెలకొల్పారని కొనియాడారు.

More Telugu News