Virat Kohli: పాకిస్థాన్ తో థ్రిల్లింగ్ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పిన రోహిత్ శర్మ

Rohit Sharma told the turning point in yesterday match
  • టీ20 వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ విజయభేరి
  • కోహ్లీ సూపర్ పెర్ఫార్మెన్స్
  • 53 బంతుల్లో 82 నాటౌట్
  • రవూఫ్ ఓవర్లో రెండు భారీ సిక్సులు
  • ఈ సిక్సులే మ్యాచ్ ను మలుపు తిప్పాయన్న రోహిత్
టీ20 వరల్డ్ కప్ లో నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా నెగ్గిందంటే అది విరాట్ కోహ్లీ మాస్టర్ ఇన్నింగ్స్ చలవే. చివరి ఓవర్లలో కోహ్లీ తన నైపుణ్యం చాటేలా ఆడిన షాట్లు అభిమానులను ఉర్రూతలూగించాయి. కాగా, కోహ్లీ పెర్ఫార్మెన్స్ కు క్రికెట్ ప్రపంచం నీరాజనాలు పలుకుతోంది. దీనిపై టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పందించాడు. 

పాకిస్థాన్ తో మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పాడు. హరీస్ రవూఫ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కోహ్లీ రెండు సిక్స్ లు బాదడమే మ్యాచ్ ను మలుపు తిప్పిందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఆ ఓవర్లో కోహ్లీ అటాకింగ్ గేమ్ ఆడడం వల్లే మ్యాచ్ తమ వైపు మొగ్గిందని వివరించాడు. 

చివర్లో ఓ స్పిన్నర్ బౌలింగ్ చేసే అవకాశం ఉందని తాము అంచనా వేశామని, ఆఖరి ఓవర్లో టార్గెట్ 15-18 పరుగులకు మించకుండా ఉంటే మ్యాచ్ మనదేనని భావించామని రోహిత్ శర్మ తెలిపాడు. కోహ్లీ సరైన సమయంలో దూకుడు ప్రదర్శించడంతో చివరి ఓవర్లో భారత్ పని సులువైందని వెల్లడించాడు. 

కాగా, పాక్ తో మ్యాచ్ లో చివర్లో భారత్ 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉండగా, కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన హరీస్ రవూఫ్ బౌలింగ్ లో రెండు వరుస సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దాంతో చివరి ఓవర్లో భారత్ లక్ష్యం 6 బంతుల్లో 16 పరుగులుగా మారిపోయింది. 

కోహ్లీ విశ్వరూపం ప్రదర్శిస్తున్న సమయంలో నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా... మ్యాచ్ ముగిసిన తర్వాత దీనిపై స్పందించాడు. హరీస్ రవూఫ్ వంటి ఫాస్ట్ బౌలర్ ను ఆ దశలో రెండు సిక్సర్లు కొట్టడమంటే కోహ్లీకి తప్ప మరొకరికి సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు.  

రవూఫ్ ఆ ఓవర్లో ఎలాంటి లూజ్ బాల్స్ వేయకపోయినా, కోహ్లీ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి బంతులను అలవోకగా స్టాండ్స్ లోకి పంపడం విశేషం. ఓ బంతిని రవూఫ్ గుడ్ లెంగ్త్ ఏరియాలో విసరగా, కోహ్లీ కొంచెం వెనక్కి జరిగి దాన్ని హై లిఫ్ట్ తో నేరుగా సిక్స్ బాదాడు.

ఆ తర్వాత బంతి లెంగ్త్ ఏరియాలోనే లెగ్ స్టంప్ లైన్ లో రాగా, నమ్మశక్యం కాని రీతిలో దాన్ని గ్లాన్స్ చేసి డీప్ స్క్వేర్ లెగ్ లో ప్రేక్షకుల్లో పడేలా కొట్టాడు. ఎంతో ఒత్తిడి నెలకొన్న దశలో ఈ రెండు షాట్లు ఆడడం కోహ్లీ ప్రతిభకు నిదర్శనం.
Virat Kohli
Rohit Sharma
Turning Point
Team India
Pakistan
T20 World Cup

More Telugu News