Dhanteras: ధన్​ తేరస్ ధమాకా.. రెండు రోజుల్లో 25 వేల కోట్ల ఆభరణాలు కొనేశారు

Jewellery industry rakes in a whopping Rs 25000 cr in 2 days
  • ఈ ఏడాది దీపావళి విక్రయాలు లక్షన్నర కోట్లు ఉంటాయని మార్కెట్ అంచనా
  • ఈసారి స్వదేశీ వస్తువులకే మొగ్గు చూపిన ప్రజలు
  • చైనా వస్తువుల వ్యాపారంలో 75 వేల కోట్ల నష్టం
భారత మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. ప్రతీ శుభకార్యానికి బంగారం కొనుగోలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా దీపావళి ముంగిట ధన్‌తేరస్ సందర్భంగా కొత్త బంగారం కొనుగోలు చేస్తే ధనలక్ష్మి వరసిద్ధి లభిస్తుందని నమ్ముతారు. దాంతో, ప్రతీ ఏడాది ధన్‌తేరస్ (ధన త్రయోదశి) పురస్కరించుకొని తమ తాహతును బట్టి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ నెల 22, 23వ తేదీల్లో దేశంలో ధన్‌తేరస్ సందర్భంగా ఏకంగా 25 వేల కోట్ల విలువైన ఆభరణాలు అమ్ముడయ్యాయి. రెండు రోజుల ధన్‌తేరస్ పండుగ ఫలితంగా దేశంలో బంగారం, వెండి నాణేలు, ఆభరణాల అమ్మకాలు భారీగా జరిగాయి. సుమారు రూ. 25,000 కోట్ల విలువైన బంగారు, వెండి నాణేలు అమ్ముడయ్యాయి’ అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 

కేవలం ఆభరణాలు మాత్రమే కాదు పండగ సందర్భంగా ఇతర వస్తువుల కొనుగోళ్లు కూడా భారీగా జరిగాయి. ఈ లెక్కన దీపావళి ముంగిట దేశంలో మొత్తం వ్యాపారం రూ.45,000 కోట్లు దాటింది. ఆటోమొబైల్స్, కంప్యూటర్లు, కంప్యూటర్ సంబంధిత వస్తువులు, ఫర్నిచర్, అలంకరణకు అవసరమైన వస్తువులు, మిఠాయిలు, స్నాక్ బాక్సులు, వంటగది వస్తువులు, అన్ని రకాల పాత్రలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్ వస్తువులలో సుమారు రూ. 20,000 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధన్‌తేరస్ సందర్భంగా గత రెండు రోజుల్లో ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడం కనిపించింది. ఇది ఆఫ్‌లైన్ మార్కెట్‌ల నుంచి భారతీయ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజల ఆసక్తిని రుజువు చేసిందని ప్రవీణ్ ఖండేల్‌వాల్ పేర్కొన్నారు.

కరోనా కారణంగా రెండు సంవత్సరాల మార్కెట్ తిరోగమనం తరువాత, మార్కెట్‌లలో కస్టమర్ల ఎడతెగని ప్రవాహం వ్యాపారులకు ఆనందాన్ని తెచ్చిపెట్టిందన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ లో కలిపి ఈ ఏడాది దీపావళి పండుగ విక్రయాలు దేశంలో రూ.1,50,000 కోట్లకు మించి ఉంటాయని సీఏఐటీ పేర్కొంది. ఈ సారి వినియోగదారులు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడానికి ఇష్టపడటం ఈ పండగ ప్రత్యేకత అని అభిప్రాయపడింది. దీని వలన చైనా వ్యాపారంలో రూ. 75,000 కోట్లు తగ్గిందని తెలిపింది.
Dhanteras
India
sale
gold
25000 sale
1.5 lakh

More Telugu News