Britain: బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునాక్ ఎన్నిక దాదాపు ఖాయమే

  • ఇప్పటికే 142 మంది ఎంపీల మద్దతు
  • పోటీ నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్
  • ఎంపీల మద్దతు కూడగట్టడంలో వెనకబడిన మోర్డాంట్
  • మధ్యాహ్నం 2 గంటల వరకే గడువు
  • ఆ తర్వాత సునాక్ ఎన్నిక ఏకగ్రీవమే
Rishi Sunak May Become UK PM

బ్రిటన్ కొత్త ప్రధానిగా మాజీ ఆర్థిక మంత్రి, కన్జర్వేటివ్ నేత రిషి సునాక్ ఎన్నిక దాదాపు ఖాయమైనట్లేనని సమాచారం. ఇప్పటికే 150 మందికి పైగా ఎంపీల మద్దతుతో సునాక్ ప్రధాని రేసులో ముందున్నారు. తాజాగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో సునాక్ కు మార్గం సులువైంది. ప్రస్తుతం పెన్నీ మోర్డాంట్ మాత్రమే ప్రధాని రేసులో సునాక్ తో పోటీకి నిలిచారు. అయితే, రేసులో నిలవాలంటే కనీసం వంద మంది ఎంపీల మద్దతును ఆమె కూడగట్టాల్సి ఉంటుంది. దానికి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వ్యవధి ఉంది. ఈలోగా ఎంపీల మద్దతు సాధించడంలో మోర్డాన్ విఫలమైతే రిషి సునాక్ ప్రధానిగా గెలుపొందినట్లే. పోటీలో ఎవరూ నిలవకపోవడంతో సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటిస్తారు.

ట్రస్ రాజీనామాతో మారిన పరిస్థితులు..

బోరిస్ జాన్సన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ట్రస్ పై ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. వరుసగా తన కేబినెట్ లోని మంత్రులు రాజీనామాలు చేయడంతో గత్యంతరం లేక ట్రస్ కూడా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ లో మరోసారి ప్రధాని పదవికి ఎన్నికలు అనివార్యంగా మారాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ప్రధాని పీఠంపై కూర్చునేందుకు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సిద్ధమయ్యారు. మరో నేత పెన్నీ మోర్డాంట్ కూడా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే వందమంది ఎంపీల మద్దతు పలికినా.. ప్రధాని పోటీపై సునాక్ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు.

రేసు నుంచి తప్పుకున్న బోరిస్..
ప్రధాని పీఠం ఖాళీ కావడంతో విహారయాత్రలో ఉన్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన తిరిగొచ్చారు. పోటీలో ఉండేదీ లేనిదీ ప్రకటించే ముందు తన శక్తియుక్తులను సమీక్షించుకున్నారు. ఎక్కువమంది ఎంపీలు రిషి సునాక్ కు మద్దతు పలకడం, గెలుపు అవకాశాలు సునక్ కే ఎక్కువ ఉండడంతో జాన్సన్ ఆలోచనలో పడ్డారు. పార్టీ భవిష్యత్తు కోసం పోటీలో నుంచి తప్పుకుని తనకు అవకాశం ఇవ్వాలంటూ రిషి సునక్ కు జాన్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నేతలు ఇద్దరూ భేటీ అయ్యి, సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత బ్రిటన్ ప్రధాని పదవి రేసులో నుంచి తప్పుకుంటున్నట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కనీస సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపారు.

కనీస అర్హతకు చాలా దూరంలో మోర్డాంట్
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడాలంటే కనీసం వంద మంది ఎంపీల మద్దతు కూడగట్టాలి. ఎన్నికల ప్రక్రియలో ఇదే తొలి అడుగు.. ఆ తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం 142 మంది ఎంపీల మద్దతుతో రిషి సునాక్ ఈ పోటీలో ముందుండగా.. కనీస సభ్యుల మద్దతు కూడగట్టడంలో పెన్నీ మోర్డాంట్ చతికిలపడ్డారు. ప్రస్తుతం ఆమె మద్దతుగా నిలిచిన ఎంపీల సంఖ్య కేవలం 29 మాత్రమే. దీంతో ప్రధాని పదవికి జరుగుతున్న రేసులో మోర్డాంట్ చాలా దూరంలో ఉన్నారు.

More Telugu News