Janasena: ట్విట్టర్ వేదికగా మహిళా కమిషన్‌పై జనసేన ప్రశ్నల వర్షం

Janasena Firing with questions on AP Women Commission
  • జనసేనాని పవన్‌కు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
  • వైసీపీ మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్న
  • రెండుమూడుసార్లు అత్యాచారాలు జరుగుతుంటాయని మహిళా మంత్రి అన్నప్పుడు కమిషన్ ఎక్కడుందని నిలదీత
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేయడంపై జనసేన తీవ్రంగా స్పందించింది. ట్విట్టర్ వేదికగా #APWomenCommissionExposed హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నల వర్షం కురిపించింది. వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మహిళలను కించపరిచినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. అత్యాచారాలకు తల్లి పెంపకంలో లోపమే కారణమని రాష్ట్ర హోంమంత్రి అన్న వ్యాఖ్యలు మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? అని ప్రశ్నించింది. గర్భిణులు, బాలికలపై  అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీసింది.

రెండు, మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయని మహిళా మంత్రి వ్యాఖ్యానించినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. సుగాలి ప్రీతి విషయంలో మహిళా కమిషన్ ఏం చేసిందని నిలదీసింది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దళిత బాలికపై ఏడాదిపాటు అత్యాచారం జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. గతేడాది ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల మహిళా ఇంజినీరింగ్ విద్యార్థిపై పట్టపగలు దుండగుడు దాడిచేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచినప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందని జనసేన తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించింది.
Janasena
#APWomenCommissionExposed
Pawan Kalyan
Vasireddy Padma

More Telugu News